కూటమి సర్కారు సంచలన నిర్ణయం.. వార్డు సచివాలయాల పేరు మార్పు !!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 'వార్డు సచివాలయాల' పేరును ఇకపై 'స్వర్ణ వార్డు'లుగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు కేవలం సేవలు అందించడమే కాకుండా.. ఆ సేవల్లో అత్యున్నత నాణ్యత, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా చెబుతున్నారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర వేయగా.. ప్రభుత్వం అధికారికంగా గెజిట్‌ను కూడా విడుదల చేసింది.
పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఈ మార్పుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ప్రభుత్వ రికార్డుల నుంచి మొదలుకొని క్షేత్రస్థాయి బోర్డుల వరకు అన్ని చోట్లా 'స్వర్ణ వార్డు' అనే పేరు తక్షణమే అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో పట్టణాల్లోని సచివాలయాల బోర్డులు, అధికారిక పత్రాలు, ప్రభుత్వ రికార్డులు.. ఆన్‌లైన్ పోర్టల్స్ అన్నింటిలోనూ పాత పేరు స్థానంలో కొత్త పేరు చేరనుంది.

కాగా దశలవారీగా ప్రజలకు కనిపించే ప్రతి ప్రభుత్వ లావాదేవీలోనూ ఈ మార్పును అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇది కేవలం నామమాత్రపు పేరు మార్పు మాత్రమే కాదని.. పనితీరులో జవాబుదారీతనాన్ని పెంచే ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇక 'స్వర్ణం' (బంగారం) అనేది విలువకు, విశ్వసనీయతకు, నాణ్యతకు చిహ్నంగా భావిస్తున్నారు.
ఇక పట్టణ ప్రజలకు అందించే సేవలలో ఎక్కడా జాప్యం లేకుండా, అవినీతికి తావులేకుండా.. అత్యంత వేగంగా పారదర్శకమైన పాలనను అందించడమే ఈ పేరు వెనుక ఉన్న అసలు ఉద్దేశంగా వెల్లడిస్తున్నారు. ప్రజా సమస్యలకు తక్షణమే స్పందించి పరిష్కారాలు చూపేలా, ప్రజలకు మరింత చేరువైన పరిపాలనను అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా వర్ణిస్తున్నారు. ఈ సంస్కరణ ద్వారా సామాన్య ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. అన్ని రకాల ప్రభుత్వ సేవలు ఒకే చోట లభించడమే కాకుండా, ఫిర్యాదుల పట్ల అధికారులు మరింత త్వరితగతిన స్పందించేలా వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. దీంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications