ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిలుపుదల - ప్రభుత్వ నిర్ణయం వెనుక..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించిన భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని నిర్ణయించింది. గత ఐదేళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లపైనా విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. ఈ భూములపై పెరుగుతున్న ఫిర్యాదుల అంశం మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. అక్రమ ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టేందుకు డిప్యూటీ కలెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
మూడు నెలల పాటు
రాష్ట్ర వ్యాప్తంగా 22(ఎ) కింద ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను మూడు నెలల పాటు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమ భూములు బలవంతంగా లాక్కున్నారని, రికార్డులు తారుమారు చేశారని, భూకబ్జాలు చేశారని పేదలు, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని గ్రామాలవారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి.. వీటన్నింటిని సమగ్రంగా పరిశీలించాలని.. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని.. అప్పటివరకు 22-ఏ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని నిశ్చయించింది.

గత ప్రభుత్వంలో అక్రమాలు
గత ప్రభుత్వంలో 22ఏ భూములను ఫ్రీ హోల్డ్ చేసి దోపిడీకి పాల్పడిందనే అరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో 13 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. భూ కబ్జాలను, తప్పుడు రిజిస్ట్రేషన్లన్నింటినీ బయటపెట్టాలని భావిస్తోంది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు జరిగిన 25 వేల ఎకరాలపైనా విచారణ జరపాలని కేబినెట్ ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. 36 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు గాను ఇప్పటి వరకు 13 లక్షల ఎకరాలను 20 ఏళ్ల కాలపరిమితి నిబంధన కింద నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించారని రెవెన్యూ శాఖ ఈ సందర్భంగా నివేదించింది.
మూడు నెలల గడువు
ముందుగానే పేదల నుంచి లాక్కుని, బెదిరించి దౌర్జన్యంగా తీసుకున్న భూములను ఫ్రీ హోల్డ్ కింద 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొంది. పేదల నుంచి ఫిర్యాదులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి తేల్చేయాలన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. భూముల అక్రమాలపై పరిశీలనను మూడు నెలల్లో పూర్తిచేయాలని.. అప్పటిదాకా అసైన్డ్, చుక్కల భూములను 22ఏ నుంచి తొలగించరాదని.. ఇప్పటికే తొలగించిన వాటిని రిజిస్టర్ చేయకుండా నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications