రాజధాని తరలిపోతోంది- హోదా మారిపోయింది- విజయవాడ సీపీగా ఐజీ ర్యాంకు అధికారి...
ఏపీ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదన పూర్తిగా అమల్లోకి రాకపోయినా దానికి అనుబంధంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ చకచకా జరిగిపోతున్నాయి. రాజధాని మార్పుతో అమరావతి కంటే విశాఖకు ప్రాధాన్యం పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న మరో నిర్ణయం చర్చనీయాంశం గామారింది. విజయవాడ సీపీగా గతంలో ఉన్న అదనపు డీజీ హోదాను ఐజీకి తగ్గిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐజీ ర్యాంకు అధికారి బి. శ్రీనివాసులు ఇవాళ సీపీగా బాధ్యతలు చేపట్టారు.

విజయవాడ సీపీ హోదా తగ్గింది...
విజయవాడ పోలీసు కమిషనర్ గా గత ఐదేళ్లుగా అదనపు డైరెక్టర్ జనరల్ ర్యాంకు అధికారులే పనిచేస్తూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం ఈ హోదాను ఇన్ స్పెక్టర్ జనరల్ కు పరిమితం చేసింది. దీంతో తాజాగా డీజీ ర్యాంకులో ఉన్న ప్రస్తుత కమిషనర్ ద్వారకాతిరుమల రావు స్ధానంలో ఐజీ ర్యాంకులో ఉన్న బి.శ్రీనివాసులు కొత్త కమిషనర్ గా నియమితులయ్యారు. గతంలో కంటే విజయవాడలో తగ్గిన క్రైమ్ రేట్, ఇతర పరిస్ధితులే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబు హయాంలో...
గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2015లో రాజధాని ప్రకటన తర్వాత అప్పట్లో అదనపు డీజీ ర్యాంకు అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావును పోలీసు కమిషనర్ గా నియమించడంతో పాటు విజయవాడ సీపీ హోదాను కూడా అదనపు డీజీకి పెంచింది. అమరావతి రాజధాని కావడంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏబీ వెంకటేశ్వరరావు తర్వాత వచ్చిన గౌతం సవాంగ్ కూడా అదనపు డీజీగానే సీపీ పదవి చేపట్టినా ఆ తర్వాత డీజీగా ప్రమోషన్ పొందారు. అయితే సీపీ హోదా మాత్రం అదనపు డీజీగా కొనసాగింది.
Recommended Video

రాజధాని మార్పు నేపథ్యం...
తాజాగా ఏపీ ప్రభుత్వం మూడు రాజదానుల ప్రతిపాదన తీసుకురావడం, ఇందుకు అనుగుణంగా పలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వీటి ప్రభావం విజయవాడపైనా పడింది. అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధాని విశాఖకు తరలిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా విజయవాడతో పాటు అమరావతిపైనా దృష్టి తగ్గించింది. ఇందులో భాగంగానే విజయవాడ సీపీ పోస్టు హోదాను ఐజీకి పరిమితం చేస్తూ తాజా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఐజీ ర్యాంకు అధికారిగా ఉన్న 1998 బ్యాచ్ ఐపీఎస్ బత్తిన శ్రీనివాసులు మరోసారి విజయవాడ సీపీగా బాధ్యతలు చేపట్టారు.












Click it and Unblock the Notifications