ఏడాదిలో రిటైర్ అవుతున్న ఉద్యోగులకు ఏపీ సర్కార్ ఊరట..!
ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియకు కూటమి సర్కార్ తెరలేపింది. ఈ నెల 19 నుంచి 31 వరకూ ఎక్సైజ్ శాఖ మినహా మిగిలిన శాఖల్లో ఉద్యోగుల్ని బదిలీలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే ఇందులో ఏడాదిలోపు రిటైర్ అవుతున్న ఉద్యోగులను ఈ ప్రక్రియ నుంచి మినహాయించాలనే డిమాండ్లు వచ్చాయి. ఏడాది లోపు రిటైర్ అవుతున్న ఉద్యోగులను కూడా బదిలీ చేయడం సరికాదని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి.
దీంతో ప్రభుత్వం స్పందించింది. ఏడాది లోపు రిటైర్ అవుతున్న ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. 31.03.2025 లోపు పదవీ విరమణ పొందే ఉద్యోగులందరికీ ప్రస్తుత సాధారణ బదిలీల నుండి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో 8 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

వాస్తవానికి ఏడాదిలో రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులు 62 సంవత్సరాల వయసులో అనేక శారీరక జబ్బులతో తీవ్ర ఇబ్బందులకు గురికావడమే కాకుండా, వారి పెన్షన్ పేపర్లు ఆరు మాసాలు ముందుగా తయారు చేసుకునే వెసులుబాటు ఉండదని, ఇదే విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అలాగే గతంలో అనేక సార్లు ఇలా మినహాయింపులు ఇచ్చిన విషయం కూడా గుర్తుచేశారు. దీంతో ప్రభుత్వం వారి వినతికి స్పందించి ఏడాది లోపు రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications