పవన్ ఎఫెక్ట్ -ఏపీ సర్కార్ సిట్ ఏర్పాటు-ఉత్తర్వులు జారీ..!
ఏపీలో కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. తాజాగా కాకినాడ పోర్టుకు వెళ్లి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న పవన్ కళ్యాణ్.. తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడ పోర్టు భద్రతతో పాటు రేషన్ బియ్యం అక్రమ రవాణానూ ప్రశ్నించారు. అక్కడ తనకు సహకరించని అధికారుల తీరుపైనా పవన్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రభుత్వం వరుసగా చర్యలకు దిగుతోంది. ఇప్పటికే కాకినాడ పోర్టుపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం .. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిపోతున్న నేపథ్యంలో పోలీసులు, ఇతర శాఖలు ఇప్పటికే పలు కేసులు నమోదు చేశాయి. వీటిని ఉమ్మడిగా దర్యాప్తు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇవాళ ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ జిల్లాల్లో రేషన్ బియ్యంపై నమోదైన కేసుల్ని దర్యాప్తు చేసేందుకు ఈ సిట్ పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే 13 కేసుల వివరాలను కూడా జీవోలో ఇచ్చారు.

విదేశాలకు అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యంపై పౌర సమాజంతో పాటు ప్రజా ప్రతినిధుల నుంచి తరచుగా వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. వీటిపై ఇప్పటికే వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన 13 కేసుల దర్యాప్తు కోసం ఆరుగురు పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. ఇందులో సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్, సీఐడీ ఎస్పీ ఉమా మహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, బాలసుందర రావు, గోవిందరావు, రత్తయ్య ఉన్నారు. ఈ సిట్ ను అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 15 రోజుల్లో ఈ సిట్ తమ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications