ఏపీలో రిజిస్టర్ పోస్టులో ఇంటికే స్మార్ట్ రేషన్ కార్డు..! ఛార్జీ ఇదే..!
ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ప్రక్రియ ద్వారా వివిధ జిల్లాల్లో రేషన్ కార్డుల్ని లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇందులో అక్కడక్కడా లోపాలు తలెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం అక్టోబర్ 31 వరకూ సాధ్యమైనంత వరకూ రేషన్ కార్డుల్ని పంపిణీ చేసి అనంతరం వీటిని లబ్దిదారుల ఇళ్లకే రిజిస్టర్ పోస్టు ద్వారా పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు.
అక్టోబర్ 31 వరకూ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల్ని లబ్దిదారులకు నిర్దేశిత ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. అయితే నవంబర్ 1 నుంచి మాత్రం రూ.35ల నామమాత్రపు ఫీజు చెల్లిస్తే స్మార్ట్ రేషన్ కార్డును లబ్దిదారుల ఇంటికే పంపే సదుపాయం అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. పోస్టల్ శాఖ సాయంతో రిజిస్టర్ పోస్టు ద్వారా ఇలా స్మార్ట్ రేషన్ కార్డుల్ని లబ్దిదారుల ఇంటికి పంపనున్నట్లు తెలిపారు.

అయితే అక్టోబర్ 31 వరకూ రేషన్ కార్డులు తీసుకోని వారికి మాత్రమే ఈ సదుపాయం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఇళ్ల వద్ద రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. మిగతా వారికి మాత్రం నిర్దేశిత ప్రాంతాల్లోనే ఇస్తున్నారు. ఇలా అక్టోబర్ 31 వరకూ కార్డులు రాని వారికి నవంబర్ 1 నుంచి రిజిస్టర్ పోస్టు ద్వారా కార్డు తీసుకునేందుకు వీలుగా సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది.

స్మార్ట్ రేషన్ కార్డు రాని వారు రూ.35 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే మాత్రం వారికి రిజిస్టర్ పోస్టు ద్వారా నిర్ణీత సమయంలో ఇంటి వద్దే దాన్ని తీసుకోవచ్చని పౌరసరఫరాలశాఖ చెబుతోంది. మరోవైపు స్మార్ట్ కార్డు రాకపోవడం సహా ఇతరత్రా కారణాలతో మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకపోతే మాత్రం రేషన్ కార్డు రద్దు చేయనున్నారు. తిరిగి సచివాలయానికి వెళ్లి తగిన వివరాలు సమర్పించి కార్డు యాక్టివేట్ చేసుకునే అవకాశం మాత్రం కల్పిస్తారు.












Click it and Unblock the Notifications