అమరావతిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - ఉత్తర్వులు జారీ..!!
అమరావతికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసింది. అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. రాజధాని పరిధిలోని ఐదు గ్రామల్లో 900.97 ఎకరాల్లో పేదల ఇళ్ల కోసం జోనింగ్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్విడుదల చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో ఆర్-5 జోనింగ్ ఉంటుందని చెప్పింది.

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు
తూళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లోనూ ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. 28 వేలమంది పేదలకు అక్కడ ఇళ్ల పట్టాలకు నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ మార్చరాదని రైతుల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీఆర్‌డీఏ కమిషనర్‌కు వినతి పత్రాలు అందిస్తున్నారు. గతంలోనే అమరావతి రాజధిని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా, న్యాయ పరమైన చిక్కుల కారణంగా సాధ్య పడలేదు. సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లును కొద్ది రోజుల క్రితమే గవర్నర్ ఆమోదించారు. ఆర్-5 జోన్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించటానికి 15 రోజుల గడువు ఇచ్చింది.అక్టోబరు 28వ తేదీ నుంచి నవంబరు 11వ తేదీ వరకు సీఆర్‌డీఏకు అభ్యంతరాలు తెలియజేయాలని సూచించింది.

మాస్టర్ ప్లాన్ లో మార్పులు
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఆర్-5 జోన్‌తో రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాల కేటాయించేందుకు నిర్ణయం అమలు చేస్తోంది. అభ్యంతరాల స్వీకరణ పూర్తయిన తరువాత ప్రభుత్వం ఇక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది. చేశారు. కృష్ణాయపాలెం, ఐనవోలు, మందడం, కురగల్లులో 900 ఎకరాలను యూ-1 రిజర్వు జోన్, సీ 5 రీజనల్ జోన్, 13 నాన్ పొల్యూటింగ్ జోన్, టౌన్ జోన్, ఎడ్యుకేషనల్ జోన్, నైబర్ ఉడ్ జోన్‌గా ప్రతిపాదిస్తూ ప్రకటన జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసేందుకు స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు కల్పించింది.

తాజా నోటిఫికేషన్ జారీ
ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఇప్పటికే ప్రభుత్వం సీఆర్డీఏ చట్ట సవరణ చేసింది. దానికి అనుగుణంగానే పేదల ఇళ్లస్థలాల కోసం స్పెషల్‌జోన్‌పై ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తూ సీఆర్డీఏ జారీ చేసిన పత్రికా ప్రకటనపై రాజధాని రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ మార్చరాదని సీఆర్డీఏ కమిషనర్‌కు, స్థానిక పంచాయతీ కార్యాలయాల్లో రైతులు వినతి పత్రాలు అందజేశారు.ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయటంతో, ఈ వ్యవహారంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.












Click it and Unblock the Notifications