TTD Board: టీటీడీ బోర్డు సభ్యుల్లో రెండు మార్పులు ? జీవో ఆలస్యం వెనుక ?
ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 24 మందితో కూడిన బోర్డును ప్రకటించింది. ఈ బోర్డులో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి కూడా సభ్యుల్ని ఎంచుకున్నారు. ప్రతీ సభ్యుడి ఎంపిక వెనుక ప్రత్యేక కారణాలు, సిఫార్సులు ఉన్నాయని అర్థమవుతోంది. ఛైర్మన్ గా టీవీ5 ఛానల్ చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడిని ఎంపిక చేసారు. అయితే సభ్యుల విషయంలో మాత్రం అభ్యంతరాలు మొదలయ్యాయి.

ఏపీ ప్రభుత్వం నిన్న విడుదల చేసిన టీటీడీ కొత్త బోర్డులో 24 మంది సభ్యులను నియమించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల సభ్యులతో పాటు ఇతర రాష్ట్రాలకూ అవకాశం దక్కింది. అయితే ఏపీకి సంబంధించిన ఓ సభ్యుడి విషయంలో టీడీపీలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మహారాష్ట్రకు చెందిన మరో సభ్యుడి నియామకంపైనా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దీంతో వీరిద్దరి విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది.
ఏపీకి సంబంధించిన సభ్యుడు గత వైసీపీ ప్రభుత్వంలో పదవులు అనుభవించి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆయనకు టీటీడీ బోర్డు సభ్యత్వం దక్కడంతో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని ఆయనకు ఎలా ఛాన్స్ ఇస్తారనే వాదనను వారు అధిష్టానానికి వినిపిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రకు చెందిన కేంద్రం సిఫార్సు చేసిన మరో సభ్యుడి విషయంలో ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు బదులుగా మరో సభ్యుడిని నియమించే అవకాశముంది. అందుకే టీటీడీ బోర్డు నియామకంపై జీవో ఆలస్యమవుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications