ఏపీలో క్యాష్ లెస్ ఫ్రీ గ్యాస్ సిలెండర్-ఈ రెండు జిల్లాల్లో బుకింగ్స్ -మంత్రి ప్రకటన..!
'దీపం-2' లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం ఇవాళ తీపి కబురు చెప్పింది. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం నగదు చెల్లించవలసిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇకపై డిజిటల్ వాలెట్ చెల్లింపులు ఉంటాయన్నారు. పౌర సరఫరాల శాఖ పరిధిలో గ్యాస్ ఏజెన్సీల సహకారంతో దీపం-2 పథకం కింద డిజిటల్ వాలెట్ ద్వారా నగదు చెల్లింపును పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ వినూత్న కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా మరియు గుంటూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టులో ఎన్టీఆర్ జిల్లా విద్యాధరపురం పరిధిలో1119 మంది లబ్ధిదారులు , బీపీసీఎల్ పరిధిలో 806 మంది లబ్ధిదారులు, ఐఏసీఎల్ పటమట పరిధిలో236 మంది లబ్ధిదారులు, ఐఓసీఎల్ కృష్ణలంక పరిధిలో428 మంది లబ్ధిదారులు , గుంటూరు జిల్లా హెచ్ పీసీఎల్ మంగళగిరి పరిధిలో 1032 మంది లబ్ధిదారులు, బీపీసీఎల్ మంగళగిరి పరిధిలో 660 మంది లబ్ధిదారులు కలిపి మొత్తం ఆరు గ్యాస్ ఏజెన్సీ ల పరిధిలో 4282 మంది లబ్ధిదారులు భాగస్వాములవుతున్నాని మంత్రి తెలిపారు.

దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఇకపై లబ్ధిదారులు ముందుగా సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. సిలిండర్ బుకింగ్ చేసిన వెంటనే రాయితీ డబ్బును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. లబ్ధిదారులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) యాప్ ను డౌన్లోడ్ చేసుకుని, తన డిజిటల్ వాలెట్‌ను యాక్టివేట్ చేసుకోవాలని, సిలిండర్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్ వద్దనున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంతో డిజిటల్ వాలెట్ ద్వారా ఏజెన్సీకి నగదు చెల్లింపు జరుగుతుందన్నారు. దీంతో లబ్ధిదారుడు పూర్తిగా నగదు చెల్లించకుండా, ఉచితంగా సిలిండర్ పొందగలుగుతారన్నారు.

ఈ విధానంతో లబ్ధిదారులు డిజిటల్ వాలెట్ ద్వారా పూర్తిగా ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందగలుగుతారని మంత్రి పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరించే దిశగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించనుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications