ఏపీకి వచ్చే పర్యాటకులకు ఇక పండగే..!
ఏపీలో పర్యాటకులకు ప్రభుత్వం ఇవాళ శుభవార్త చెప్పింది. ఐదేళ్లుగా రాష్ట్రంలో కుదేలైన పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానాన్ని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. శాసనసభలో నూతన టూరిజం పాలసీని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు. పర్యాటక రంగంలో ఏపీని దేశంలో అగ్రగామిగా నిలబెట్టాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిన రాష్ట్రంగా చరిత్రలో ఏపీ పేరు లిఖితం కానుందని మంత్రి దుర్గేష్ తెలిపారు. పరిశ్రమ హోదాతో పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందన్నారు. పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించే విధంగా కొత్త టూరిజం పాలసీ ఉందన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచ, భారతదేశ పర్యాటకులకు ప్రత్యేక పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నారు.

పర్యాటక రంగంలో ఒక పర్యాటకుడు పెట్టే ఖర్చును రూ.1,700 నుండి రూ.25,000లకు తీసుకెళ్లేందుకు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయంచారు.పర్యాటక ప్రాంతంలో పర్యాటకుడు ఐదు రోజులు ఉండే విధంగా టూరిజం సర్క్యూట్ ల ఏర్పాటుకు నిర్ణయించారు. రాష్ట్రంలో టూరిజం హోటళ్లలో ఉన్న రూమ్ ల సంఖ్యను 3500 నుండి 10,000 కు పెంచబోతున్నారు. పీపీపీ విధానంలో రూ.25000 కోట్ల పెట్టుబడులు తీసుకురానున్నారు.
విశాఖపట్నం, అరకువ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో 7 యాంకర్ హబ్ లుగా ఏర్పాటు చేయనున్నారు. అమరావతి - నాగార్జున కొండ, విశాఖపట్నం- తొట్లకొండ ప్రాంతాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శైవక్షేత్రాలు తదితర ఆలయాలను కలిపేలా 10 సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తారు. కోస్టల్ టూరిజం సర్క్యూట్ లో భాగంగా వైజాగ్, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో 5 బీచ్ సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తారు. రివర్ టూరిజం సర్క్యూట్, 2 క్రూయిజ్ టూరిజం సర్క్యూట్ లు అభివృద్ధి చేస్తారు. శ్రీకాకుళం- విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి- గుంటూరు, కర్నూలు- నెల్లూరులలో ఎకో టూరిజం సర్క్యూట్ లు రానున్నాయి.












Click it and Unblock the Notifications