అమరావతి రైతులకు జగన్ గుడ్ న్యూస్-రూ.195 కోట్లు విడుదల-హైకోర్టు విచారణకు ముందే
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం దాదాపు 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. అప్పట్లో రైతులకు రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకూ వారి భూములకు కౌలు చెల్లిస్తామని, రాజధాని నిర్మాణం పూర్తయ్యాక అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ హామీ మేరకు జగన్ సర్కార్ రూ.195 కోట్ల కౌలు మొత్తాన్ని ఇవాళ రైతుల ఖాతాల్లో వేసింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని కోసం జరిగిన ఒప్పందంలో భాగంగా రైతులకు కౌలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఏటా కోర్టు కేసుల తర్వాతే వైసీపీ సర్కార్ కౌలు చెల్లిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా వార్షిక కౌలు కోసం రాజధానిలోని మందడం రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సిన నేపథ్యంలో ప్రభుత్వం కౌలు మొత్తాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు చెల్లించే మొత్తాన్ని క్యాంపు కార్యాలయం నుంచే బటన్ నొక్కి విడుదల చేస్తున్న సీఎం జగన్.. తమ కౌలు మాత్రం సకాలంలో ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

Recommended Video
మందడం రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ జరపనున్న నేపథ్యంలో పురపాలకశాఖ ఇవాళ రూ.195 కోట్ల మొత్తాన్ని రైతుల కౌలు కింద విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం రాజధాని నిర్మాణం ముందుకు సాగకపోవడం, మూడు రాజధానులు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆందోళనలో ఉన్న రైతులకు సకాలంలో కౌలు కూడా ఇవ్వకపోవడంపై ఇప్పటికే విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. దీంతో ప్రభుత్వం హైకోర్టు విచారణను దృష్టిలో ఉంచుకుని కౌలు మొత్తాన్ని విడుదల చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications