ఏపీ ఫైబర్ నెట్ లో మరో షాకింగ్- ఏకంగా 500 మంది ఉద్యోగులపై వేటు..!
సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో నియమించిన ఉద్యోగుల తొలగింపు విషయంలో మల్లగుల్లాలు పడుతూ, ఓసారి ఆదేశాలు ఇచ్చినా తొలగించేందుకు సిద్దపడని ఫైబర్ నెట్ యాజమాన్యం ఇవాళ మాత్రం ఏకంగా 500 మంది ఉద్యోగులపై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించి ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్‌లో 500 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా వీరంతా సూర్య ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నియమకాలు పొందిన వారే. దీంతో వీరందరినీ ఈ నెలాఖరుతో రిలీవవ్ అయ్యేలా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతీ ఏటా కాంట్రాక్టు పొడిగింపు విధానంలో వీరు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరికి ఇక ముందు ఎలాంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.

ఇవాళ ఫైబర్ నెట్ లో ఉద్యోగాల నుంచి తొలగించిన వారంతా సంస్థ ఆఫీసుకు విధుల్లోకి రాకుండానే జీతాలు పొందుతున్నట్లు గుర్తించారు. దీంతో వీరికి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇవే ఆరోపణలపై జీవీ రెడ్డి ఛైర్మన్ గా ఉండగా 400 మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ నిర్ణయం అమలు చేసే విషయంలో ఎండీగా ఉన్న దినేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. దీంతో జీవీ రెడ్డి ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు.
ఏపీ ఫైబర్ నెట్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున నియామకాలు జరిగాయి. వీటిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా విధులకు హాజరు కాకుండానే ఉద్యోగులు భారీగా జీతాలు తీసుకుంటున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అయినా వైసీపీ ప్రభుత్వం వారిని కొనసాగించింది. వీరిని కూటమి ప్రభుత్వం వచ్చాక తొలగించేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. ఎట్టకేలకు వీరిపై వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరంతా రాయలసీమ జిల్లాలకు చెందిన వారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications