చంద్రబాబుకు నోటీసు పంపిన సీఐపై సర్కార్ సంచలన నిర్ణయం..!
ఏపీలో సీఎం చంద్రబాబుకు గతంలో ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ లీగల్ నోటీసు పంపారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై సదరు సీఐ లీగల్ నోటీసు పంపడం వెనుక కారణం పరువు నష్టం కేసు. తన పరువుకు భంగం కలిగించారంటూ ఏకంగా చంద్రబాబుపైనే ఆయన పరువు నష్టం దావా వేస్తానని నోటీసు పంపారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు.
2019లో పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతరుల ఒత్తిడి కారణంగా కేసులు నమోదు చేయకుండా, ఘటన ప్రదేశాన్ని శుభ్రం చేయడం, ఆధారాల్ని చెరిపేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వివేకా హత్య తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం శంకరయ్యను సస్పెండ్ చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ ఆయనపై సస్పెన్షన్ ఎత్తేసింది. సీబీఐ కూడా వివేకా కేసు దర్యాప్తులో సీఐ శంకరయ్యను ప్రశ్నించి వాంగ్మూలం తీసుకుంది.

అయితే అప్పట్లో చంద్రబాబు తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తాజాగా ప్రస్తుతం కర్నూల్లో వీఆర్ లో ఉన్న సీఐ శంకరయ్య రూ.1.45 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నోటీసుల్లో శంకరయ్య.. చంద్రబాబు తనపై నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారని తెలిపారు. కాబట్టి తనకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు అసెంబ్లీలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా కోరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.శంకరయ్యను క్రమశిక్షణా చర్య కింద సర్వీసు నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications