నిరుద్యోగ భృతిపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
వేదపండితులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 590 మంది వేదపండితులు ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నారని ఆయన తెలిపారు. వారందరికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3000 ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), ఏపీ దేవాదాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో మంత్రితో పాటుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అలానే తిరుమల శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఆనం వివరించారు. విజయవాడ దుర్గ గుడికి మరో రోడ్డు వేయటానికి సహకారం కోరామన్నారు. టీటీడీలో అన్యమతస్థులు ఉన్నమాట వాస్తవేమనని.. కేంద్ర మంత్రి బండి సంజయ్ 1000 మంది అన్యమతస్థులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరుగుతోందన్నారు.
తిరుమల తిరుతి దేవస్థానం పరిధిలోని స్కూళ్లు, కాలేజీలలో 192 పోస్టుల భర్తీపై చర్చించినట్లు వివరించారు. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధుల విడుదల, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయాల వివరాలు, ఆలయాల పునరుద్ధరణ, పరిరక్షణ, పురోగతి వంటి ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చ జరిపినట్టు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications