ఏపీ ఉద్యోగులకు రేపు గుడ్ న్యూస్ ? కేబినెట్ నిర్ణయంపై ఆశలు..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినా వైసీపీ హయాం తరహాలోనే సమస్యలు తీరడం లేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ వారికి గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే ఉద్యోగుల పెండింగ్ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఉద్యోగ సంఘాలు క్షేత్రస్దాయిలో ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగ సంఘాలపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
రేపు అమరావతిలో జరిగే కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఉద్యోగులు ప్రధానంగా కోరుతున్న పలు డిమాండ్లపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో పెండింగ్ డీఏలతో పాటు పీఆర్సీ కమిషనర్ నియామకం కూడా ఉంది. గతంలో వైసీపీ హయాంలో డీఏలు పెండింగ్ ఉన్నాయని బాధపడుతున్న ఉద్యోగులకు ఇప్పుడు కూటమి సర్కార్ కూడా ఇవ్వకుండా పెండింగ్ పెడుతుండటంపై అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఒకట్రెండు డీఏలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ మేరకు ఆర్థికశాఖ వద్దకు వెళ్లిన ఫైల్ ఇవాళ క్లియర్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇది పూర్తి కాగానే కేబినెట్ ముందుకు పంపుతారు. కేబినెట్ అజెండా అంశాల్లో ఇప్పటికే చేర్చిన విషయాలతో పాటు డీఏలపైనా మంత్రులు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అదే జరిగితే కూటమి సర్కార్ హయాంలో ఉద్యోగులకు సంబంధించిన ఓ సమస్య తీరినట్లు అవుతుంది. మిగతా సమస్యలపైనా ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

మరోవైపు రేపు జరిగే కేబినెట్ భేటీలో సీఆర్డీఏ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, పెట్టుబడుల బోర్డులో తీసుకున్న నిర్ణయాలతో పాటు పలు భూకేటాయింపులకు ఆమోదముద్ర వేయనున్నారు. ఇందులో దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలపనున్నారు. రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతిలో రూ.212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి, రాజధానలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి, అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీగా సీఆర్డీఏ వ్యవహరించేలా ఆమోదం తెలుపుతారు.












Click it and Unblock the Notifications