ఏపీలో జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ-కమిషన్ రిపోర్ట్ కు అసెంబ్లీ ఆమోదం..!
సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు తర్వాత ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై ఇవాళ ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించింది. ఇందులో దళిత వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణకు తమ మద్దతు ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు ఈ చర్చకు సమాధానం ఇచ్చారు. ఇందులో ఆయన ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని ప్రకటించారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసేందుకు తాము నియమించిన ఏకసభ్య కమిషన్ రిపోర్టు ఇచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే అందులో కమిషన్ ఛైర్మన్ జనాభా గణన పూర్తి కానందున తాను ఎలాంటి సూచనలు చేయడం లేదని చెప్పారన్నారు. అయితే 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాత జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేసేలా సిఫార్సు చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీని ప్రకారం తాము కూడా జిల్లాల వారీగా విభజనకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ సమస్య ఎప్పటి నుంచో ఉందని, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే తాము కేంద్రానికి ఈ మేరకు ప్రతిపాదన చేసి పంపామని చంద్రబాబు గుర్తుచేశారు. గతంలో మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాన్ని గుర్తించి తాము దీనికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే గత ఎన్నికల్లోనూ జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తాము నిర్ణయం తీసుకుని వెళ్లామన్నారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ద్వారా ఏయే కులాలకు ఎంత మేర రిజర్వేషన్లు వస్తాయో చంద్రబాబు అసెంబ్లీలో వివరించారు. అనంతరం అసెంబ్లీ ఏకసభ్య కమిషన్ రిపోర్టును ఆమోదిస్తూ తీర్మానం చేసింది.












Click it and Unblock the Notifications