ఏపీలో టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్..! బ్యాంకు లోన్లపై ఊరట..
ఏపీలో ఆంధ్రప్రదేశ్ టౌన్ షిప్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (టిడ్కో) పథకం కింద పేదలకు నిర్మించి ఇస్తున్న ఇళ్లను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో ఇప్పటికే ఇళ్లు తీసుకుని వాటిపై బ్యాంకులకు లోన్ల చెల్లింపు చేస్తున్న లబ్దిదారులకు ఊరటనిచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణ ఇవాళ లబ్దిదారులకు శుభవార్త చెప్పారు.
రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా టిడ్కో హౌసింగ్ పథకం కింద పేదలకు ఇళ్లను కేటాయిస్తున్నారు. అయితే వీటికి ప్రభుత్వ వాటా తీసేసి బ్యాంకుల నుంచి ఇప్పించిన మిగిలిన మొత్తం రుణాలకు లబ్దిదారులు వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో ఇళ్లు తీసుకున్న వారు అక్కడ నివసించే పరిస్ధితులు ఉండటం లేదు. కానీ బ్యాంకులు మాత్రం తమ లోన్లు చెల్లించాల్సిందేనని లబ్దిదారులపై ఒత్తిడి చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం కూడా కాదనలేని పరిస్ధితి. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే టిడ్కో ఇళ్లు తీసుకుని వాటిపై లోన్లు చెల్లిస్తున్న వారికి వాటి గడువు పొడిగించేలా బ్యాంకుల్ని కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా లబ్దిదారులు లోన్లను చెల్లించే గడువు పెరకబోతోంది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణ ఇవాళ అప్ డేట్ ఇచ్చారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల ను బ్యాంకులు ఇబ్బంది పెట్టకుండా చూస్తామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతలు ఇస్తే.. వీటిలో 4.54 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచామన్నారు.
వీటిలో 2019 నాటికి 77 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం మొత్తం ఇళ్ల సంఖ్య 2.62 లక్షలకు తగ్గించేసిందన్నారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం కేవలం 90 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందని నారాయణ ఆరోపించారు. వచ్చే మూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు అన్ని రకాల మౌళిక వసతులు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని, ప్రజలు కట్టిన పన్నుల ఆదాయం కూడా వైసీపీ ప్రభుత్వం వాడేసిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications