ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు ? ఎంత ఉండొచ్చు ?
ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సమీక్షించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తీసుకొన్న కొన్ని అస్తవ్యస్త నిర్ణయాల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది.ఇందులో భూముల రిజిస్ట్రేషన్ విలువల అడ్డగోలు పెంపు కీలకమైంది. దీంతో క్షేత్రస్ధాయిలో వాస్తవ పరిస్ధితుల ఆధారంగా రిజిస్ట్రేషన్ విలువలు నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో దీనిపై సమీక్ష నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం భూముల మార్కెట్ విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువే ఎక్కువగా ఉంది. అలాగే పలు చోట్ల తక్కువగా కూడా ఉంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగం ఎలాంటి కదలిక లేకుండా స్తబ్దుగా ఉంది. ఈ సమస్య పరిష్కరించాలంటే ఆయా చోట్ల రిజిస్ట్రేషన్ విలువల్ని పెంచడం, తగ్గించడం చేయక తప్పని పరిస్ధితి ప్రభుత్వానికి ఎదురవుతోంది. దీంతో ఈ ఏడాది డిసెంబర్ లో రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువల్ని సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది.

వాస్తవానికి రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో ప్రతీ ఏడాది ఆగస్టు 1న, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి భూముల రిజిస్ట్రేషన్ విలువల్ని సవరిస్తారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆర్ధిక అవసరాల పేరుతో ప్రత్యేక సవరణలు చేస్తూ భూముల రిజిస్ట్రేషన్ల విలువల్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోయింది. దీంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల్ని పెంచలేదు. దీంతో వాటిని ఇప్పుడు సమీక్షించి మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయంచింది. ఈ తగ్గింపులు లేదా పెంపులు 10 నుంచి 20 శాతం వరకూ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications