అలా చేయాలంటే, అరెస్ట్ కు ఇది సమయం కాదు - సజ్జల కీలక వ్యాఖ్యలు..!!
చంద్రబాబు అరెస్ట్‌కు రాజకీయాలకు సంబంధం లేదని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ కారణాలను సజ్జల వివరించారు. రాజకీయంగా ఆలోచిస్తే ఇది సరైన సమయం కాదన్నారు. కానీ, తాము రాజకీయాల కోసం ఆలోచనలు చేయటం లేదన్నారు. అవినీతికి పాల్పడ్డాడు కాబట్టే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం ఎటువంటి కక్ష్య సాధింపులకు పాల్పడలేదని స్పష్టత ఇచ్చారు.
సజ్జల కీలక వ్యాఖ్యలు: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ చేసిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాల పైన సజ్జల స్పందించారు. చంద్రబాబు అరెస్టులో అసలు విషయం పక్కకు వెళ్లేలా టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసారు. బలమైన ఆధారాలతోనే సిట్ విచారణ సాగిందని చెప్పారు.

జగన్ ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉందని వివరించారు. దర్యాప్తు సంస్థలు ఎంతో స్వేచ్చగా దర్యాప్తు చేస్తున్నాయని సజ్జల చెప్పుకొచ్చారు. స్కీం పేరుతో స్కాం చేశారని..అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.
రెండేళ్ల క్రితమే ఎఫ్ఐఆర్: ఈ కేసులో రెండేళ్ల క్రితం ఎఫ్ఐఆర్ నమోదు అయిందని సజ్జల వెల్లడించారు. 2021లోనే సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసారని చెప్పారు. ఎఫ్ఐఆర్ , నోటీసు లేదని టీడీపీ ఆరోపిస్తోందని..అందులో వాస్తవం లేదన్నారు. అన్నీ తెలిసే చంద్రబాబు తన అరెస్ట్ గురించి చెపుకొచ్చారని సజ్జల వ్యాఖ్యానించారు.
2017- 18 లో 241 కోట్లు జీఎస్టీ డైవర్ట్ అయిందని ఈడీ గుర్తించిందని సజ్జల చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం కక్ష్య సాధింపు చేయాలని అనుకుంటే అమరావతి స్కాం, ఫైబర్ నెట్ కుంభకోణం, మనీ ల్యాండరింగ్ వంటి కేసుల్లో పూర్తి ఆధారాలు ఉన్నాయని సజ్జల వ్యాఖ్యానించారు. కానీ, చట్టం పద్దతి ప్రకారం వ్యవహరిస్తుందని, తాము పూర్తి నిగ్రహంతో వ్యవహరించామని సజ్జల వివరించారు.
రాజకీయంగా ఆలోచిస్తే: రాజకీయంగా ఆలోచిస్తే ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ చేయకూడదని పేర్కొన్నారు. కానీ, రాజకీయం కంటే చట్టం ప్రకారమే అడుగులు ముందుకు పడ్డాయని చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఆలోచన చేయలేదు. తాను అరెస్ట్ ఖాయమని తెలిసే, చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేసారన్నారు. అరెస్ట్ చేయకపోతే తాను ఏమీ చేయలేదని చెప్పారని..అదే ప్రామణికంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేసారని వివరించారు.
ప్రజల్లో సానుభూతి రావాలనేది చంద్రబాబు ప్రయత్నమని చెప్పుకొచ్చారు. ప్రజలకు అన్నీ తెలుసని..అన్ని ఆధారాలు ఉన్నాయని సజ్జల చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి కక్ష్య సాధింపులు ఉండవని సజ్జల తేల్చి చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.












Click it and Unblock the Notifications