రైతుల ఖాతాల్లో రూ 20 వేలు - అర్హతలు, ముహూర్తం పై తాజా ప్రకటన..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలు పైన స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే 2025-26 వార్షిక బడ్జెట్ లో ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. అసెంబ్లీ వేదికగా ఈ పథకం అమలు ముమూర్తంతో పాటుగా అర్హతల పైన క్లారిటీ వచ్చింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే పథకం అమలు చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అదే సమయంలో కౌలు రైతులకు అమలు విషయంలోనూ తమ వైఖరి స్పష్టం చేసింది.
అన్నదాత సుఖీభవ
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా పథకం అమలు పైన స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం 2025-26 వార్షిక బడ్జెట్ లో రూ 9,400 కోట్లు కేటాయించింది. ఈ పథకం వచ్చే ఆర్దిక సంవత్సరం మే నెలలో అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ప్రతీ రైతుకు రూ 20 వేలు అందిస్తామని చెప్పారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద రూ 6 వేలు రైతులకు అందుతున్నాయని వివరించారు. ఆ రూ 6 వేలు మినహాయించి... రూ 14వేల చొప్పున అర్హత ఉన్న ప్రతీ రైతు ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు.

అర్హులకు అమలు
దాదాపు ఆరు లక్షల మంది రైతులు వెబ్ ల్యాండ్ లో పేర్లు నమోదు చేసుకోలేదన్నారు. ఈ పథకం అమలులో వారికి అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసారు. భూములు లేని వ్యవసాయ రైతులకు పథకం అమలు చేస్తామని వివరించారు. కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పారు. నిరుపేద కౌలు రైతులకు ఈ పథకం అందుతుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. పీఎం కిసాన్ తరహాలోనే మూడు విడతల్లో అమలు చేయాలనేది ఏపీ ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగా మే లో అమలు చేస్తామని మంత్రి అచ్చెన్న అసెంబ్లీలో స్పష్టం చేసారు. రాష్ట్రంలో దాదాపు 55 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ది జరుగుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది.
మార్గదర్శకాలు
అన్నదాత సుఖీభవ పధకం అర్హత ఉన్న అందరికీ అందిస్తామని మంత్రి అచ్చెన్న స్పష్టం చేసారు. పథకం విధి విధానాల పైన కసరత్తు జరుగుతోంది. అదే విధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. పంటలకు భీమా సౌకర్యంతో పాటుగా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు మద్దతుగా నిలుస్తామన్నారు. ఇక, ఇటు వైసీపీ అన్నదాత సుఖీభవ పథకం కింద బడ్జెట్ లో ప్రతిపాదించిన నిధుల పైన విమర్శలు చేస్తోంది. వైసీపీ హయాంలో కైలు రైతుల్లో అందరికీ ఈ పథకం అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం ప్రకటించే మార్గదర్శకాల కోసం రైతులు వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications