పథకాల అమలు ఆ కార్దుతోనే - ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనా పరమైన నిర్ణయాలు - సంక్షేమం అమలులో సాంకేతికత జోడిస్తోంది. ఇప్పటికే కుటుంబాల సర్వే కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుటుంబాల పూర్తి సమాచారంతో అందరికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది. ఈ కార్డులతో పథకాల అమలు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా అమలు కానుంది. ప్రతీ కుటుంబానికి ఒక యూనిక్ ఐడీ ఇవ్వనుంది. దీంతో, ప్రతీ కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం ఒకే కార్డులో నిక్షిప్తం కానుంది.
ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు
ప్రభుత్వ పథకాల అమలులో ఏపీ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అన్ని శాఖల నుంచి కుటుంబాల వారీగా ఉన్న సమాచారం క్రోడీకరించి ఒకే కార్డుగా ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది. ప్రతీ కుటుంబం ఆర్దిక పరిస్థితి..వారికి అందుతున్న ప్రభుత్వ పథకాలను విశ్లేషణ చేసి వారికి కావాల్సిన సహకారం అందించేందుకు ఏఐ ను వినియోగించుకోనుంది. ఏపీ ప్రభుత్వం తయారు చేస్తున్న స్వర్ణాంధ్ర -2047 విజన్ డాక్యుమెంట్ లో ఈ ప్రతిపాదన కీలకంగా మారుతోంది.

యాప్ లో అందుబాటులో
మొబైల్ యాప్ ద్వారా అన్ని కుటుంబాలకు ఈ సమాచారం అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు ఏదైనా పథకం తమకు వద్దనుకుంటే యాప్‌లోనే నిలిపివేసుకోవచ్చు. ఈ ప్రతిపాదన అమలు దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ 2న కీలక సమావేశం ఏర్పాటు చేసారు. అందరి అభిప్రాయాలు సేకరించి పక్కాగా ఈ విధానం అమలుకు నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కుటుంబాల సమాచారం సేకరిస్తోంది. వారి అర్హతకు అనుగుణంగా పథకాలను అందిస్తోంది.
పూర్తి సమాచారంతో
అదే విధంగా గ్రామ - వార్డు సచివాలయాలతో పాటుగా సెర్ఫ్, పంచాయితీరాజ్, సీఎఫ్ఎంఎస్ వంటి విభాగాల నుంచి పూర్తి సమాచారం తీసుకుంటోంది. వీటన్నింటికీ క్రోడీకరించి అన్ని కుటుంబాలకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. ఇందు కోసం ప్రతీ కుటుంబానికి యూనిక్ ఐడీ ఇవ్వనున్నారు. కుటుంబం పేరుపై ఉన్న నెలవారీ బిల్లులు, విద్యుత్ మీటర్ల వివరాలు ఇందులో కనిపిస్తాయి.












Click it and Unblock the Notifications