మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణి సొంతం.. చారిత్రక విజయం: భట్టి విక్రమార్క
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మరో ముఖ్యమైన విజయాన్ని సాధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలో ఉన్న పీకే ఓపెన్ కాస్ట్ టు డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ ను సంస్థ సొంతం చేసుకుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ఈ బ్లాక్ సింగరేణికి దక్కినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ తో దాదాపు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు
ఈ బ్లాక్ లో సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, సంవత్సరానికి ఆరు మిలియన్ టన్నుల చొప్పున, 25 సంవత్సరాల పాటు బొగ్గు గని నడుస్తుందని పేర్కొన్నారు. దీని ద్వారా దాదాపు 2000 మంది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. పీకేఓసీ-2 g8 గ్రేడ్ మంచి నాణ్యత ఉండే బొగ్గు కారణంగా 43 వేల కోట్లకు పైగా రెవిన్యూ జనరేట్ అవుతుందని ఒక అంచనా.

రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకు మించి ఆదాయం
దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రూ.10,500 కోట్లకు మించి ఆదాయం చేకూరుతుంది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులు, తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. తెలంగాణ బిడ్డగా, సింగరేణి శ్రేయస్సు కోసం ప్రత్యేక కృషి చేసిన ఫలితమే ఈ విజయమని చెప్పారు.
చారిత్రక విజయం సాధించామన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క కూడా ఈ అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణి దక్కించుకోవడం చారిత్రక విజయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు.
నెల వ్యవధిలోనే సింగరేణికి ఇది రెండో అతిపెద్ద విజయం
ప్రజా ప్రభుత్వ కృషితో నెల వ్యవధిలోనే సింగరేణికి ఇది రెండో అతిపెద్ద విజయమని తెలిపారు. ఈ బ్లాక్ ద్వారా 20 ఏళ్ల పాటు 120 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 2 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణిని ఇతర రాష్ట్రాలకూ విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.













Click it and Unblock the Notifications