జగన్ నిర్ణయాల ప్రక్షాళన - మరో పేరు మార్పు..!!
ఏపీలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే అయిదు సంతకాలు చేసారు. అందులో జూలై 1న హామీ ఇచ్చిన విధంగా సామాజిక పెన్షన్లను అందించేలా ఉత్తర్వులు జారీ చేసారు. అదే సమయంలో జగన్ హయాంలో కార్యక్రమాలు, పథకాల పేర్లను మార్పు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా మరో పేరు మార్పు పై తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వరుస నిర్ణయాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ ముద్ర తొలిగించేలా కార్యాచరణ ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను రూ 4 వేలకు పెంచుతూ చంద్రబాబు సంతకం చేసారు. అదే విధంగా ఇతర లబ్దిదారులకు అందుతున్న పెన్షన్ మొత్తం పెంచారు. జూలై 1 నుంచి పెరిగిన పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పేరును ఎన్టీఆర్ భరోసా గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా సచివాలయం నుంచి పాలన తిరిగి ప్రారంభమైంది.

పేర్లు మార్పు
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేలా చంద్రబాబు సంతకం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల్లో 203 క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక, ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, కార్పోరేషన్లలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకొనే వారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యక్రమం పైన కీలక నిర్ణయం తీసుకున్నారు.

స్పందన ఇక నుంచి
స్పందన కార్యక్రమం పేరును "పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్" గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ సోమవారం ఈ కార్యక్రమం యథాతధంగా కొనసాగించాలని నిర్ణయించారు. దీని ద్వారా జగన్ ముద్ర తొలిగించేలా చంద్రబాబు వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక..అసెంబ్లీ సమావేశాల సమయంలో హెల్త్ వర్సిటీ పేరు మార్పుతో పాటుగా పథకాల అమలు...స్కీంల పేర్ల మార్పు పైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. రాజధాని అమరావతి..పోలవరం..ఉపాధి కల్పన..సంక్షేమం ప్రాధాన్యత అంశాలుగా పాలన కొనసాగుతుందని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications