TTD: తిరుమలలో ఆ అయిదు ఇక ప్రభుత్వ పరిధిలోకి..!!
Tirumala: తిరుమలలో భక్తుల అవసరాల పైన ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీటీడీ నూతన పాలక వర్గం భక్తులకు దర్శనం, ప్రసాదం.. వసతి విషయంలో కొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో తిరుమలలోని అయిదు డ్యామ్ ల పైన కేంద్ర జలసంఘం డైరెక్టర్ కీలక సిఫార్సులు చేసారు. ఈ డ్యామ్ ల భద్రతతో పాటుగా భవిష్యత్ అసవరాలకు అనుగుణంగా వీటిని జలవనరుల శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు వీటిని టీటీడీ నిర్వహిస్తోంది. డ్యామ్ ల భద్రతకు సంబంధించి పనులు ప్రారంభించనున్నారు.
తిరుమల డ్యామ్ లపై కసరత్తు
తిరుమలలో లక్షలాది మందికి నీటి వనరుగా ఉన్న శేషాచలం కొండల్లోని అయిదు డ్యామ్ ల పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా నీటి లభ్యత తో పాటుగా ఈ అయిదు డ్యామ్ ల భద్రత కోసం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర జల సంఘం ఆదేశాల మేరకు డ్యామ్ ల భద్రత.. నీటి సామర్ధ్యం పెంపు దిశగా చర్యలు తీసుకుంటోంది. తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార, పుసుపుధార డ్యామ్ లు అక్కడ నీటికి ప్రధాన వనరులుగా ఉన్నాయి. వీటిని ఎంతో కాలంగా టీటీడీనే నిర్వహిస్తోంది. ఇక, ఇప్పుడు ప్రభుత్వం వీటిని జలవనరుల శాఖకు అప్పగించాలని నిర్ణయించింది.

కేంద్ర జల సంఘం సిఫార్సులు
కేంద్ర జలసంఘానికి చెందిన డ్యామ్ ల భద్రతా అధికారి తాజాగా తిరుమలలో పర్యటించారు. అక్కడ డ్యామ్ లను పరిశీలించి.. భద్రత, సామర్ధ్యం పెంపు, నిర్వహణ పైన కీలక సూచనలు చేసారు. జాతీయ డ్యాం భద్రత కమిటీ తిరుమలలోని అయిదు డ్యామ్ లను సంబంధిత జాతీయ రిజిష్టర్ లో నమోదు చేసింది. దీంతో, ఇక నుంచి ఎప్పటికప్పుడు ఈ డ్యామ్ లకు సంబంధించిన సమాచారం అప్డేట్స్ చేయాల్సి ఉంటుంది. దీంతో, ఈ డ్యామ్ ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ ఇరిగేషన్ శాఖకు అప్పగించాలని నిర్ణయించారు. వీటి నిర్వహణ కోసం జలవనరుల శాఖ తాజాగా ప్రతిపాదనలు చేసింది. రెండు సబ్ డివిజన్ల ఏర్పాటుకు సూచన చేసింది. అయితే, డ్యామ్ ల భద్రత.. సామర్ధ్యం పెంపు కోసం టీటీడీ నే నిధులు వెచ్చించే అవకాశం కనిపిస్తోంది.
కొత్త జలాశయాలు
తిరుమలలో ప్రస్తుతం వస్తున్న భక్తుల సంఖ్య సగటున రోజుకు 8 వేల వరకు ఉంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య 1.25 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ అయిదు డ్యామ్ ల నీటి సామర్ధ్యం 0.229 టీఎంసీలుగా అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో అవసరాలకు అనుగుణంగా 0.5 టీఎంసీలకు పెంచే విధంగా ఈ డ్యామ్ ల సామర్ధ్యం పెంచాలని అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. కొత్తగా బాలాజీ, మల్లెమడుగు జలాశయాల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో, తిరుమలలో ఈ డ్యామ్ ల విషయంలో వచ్చిన తాజా ప్రతిపాదనల పైన ప్రభుత్వం నిపుణులు, టీటీడీతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications