Arogyasri : లబ్దిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ - రూ 25 లక్షల వరకు ఉచితం..!!
సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం మొదలైంది. తాను అమలు చేస్తున్న సంక్షేమమే తనకు తిరిగి అధికారం ఇస్తుందనే నమ్మకంతో జగన్ ఉన్నారు. ఇదే సమయంలో పలు సంక్షేమ పథకాల్లో అవసరమైన మార్పులు చేస్తున్నారు. జగనన్న సురక్ష ద్వారా ప్రజల ముందుకే వైద్యం తీసుకెళ్లారు. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం ప్రకటించారు.
ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు:ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేదల ఆరోగ్యం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు ప్రస్తుతం ఉన్న కార్డుపై అదనంగా మరికొన్ని వ్యాధులకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఇప్పటి వరకూ ఉన్న అరోగ్యశ్రీ కార్డు పరిమితిని పెంచినట్లు మంత్రి విడదల రజనీ వెల్లడించారు. ఈ పెంచిన పరిమితితో రూ. 25 లక్షలకు ఎలాంటి అపరేషన్ అయినా ఉచితంగా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ కార్డు లేని పేద కుటుంబమే ఉండటానికి వీల్లేదన్నారు మంత్రి రజినీ. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఈనెల 18 నుంచి పరిమితి పెంచిన ఆరోగ్యశ్రీ కార్డులను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారన్నారు. ఈమేరకు అతి త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు.

ఆరోగ్య శ్రీ యాప్:ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయాలు డిజిటల్ చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తద్వారా గతంలో వైద్యనిమిత్తం వచ్చిన రోగుల పూర్తి వివరాలు అందులో ఉంటాయని.. ఏ వైద్యుడిని సంప్రదించినా అతని అనారోగ్య తీవ్రత ఇట్టే అర్థమైపోతుందని వివరించారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్య శ్రీ, ఈ మూడింటికి సంబంధించిన డేటా ఒకే చోట ఉండేలా సరికొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఆరోగ్యశ్రీ మీద విస్తృతంగా, ముమ్మరంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు వివరించారు.
ఆరోగ్య శ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలో తెలియని వారు ఉండకూడదని సూచించారు.
రూ 25 లక్షలకు పెంపుతో:ప్రతి కుటుంబంలో కూడా యూప్ డౌన్లోడ్ అయ్యేలా చూస్తున్నామని వెల్లడించారు. ఇదే సమయంలో దిశ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జనవరి1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం-2 రెండోదశ కార్యక్రమాలు మొదలవుతాయన్నారు.
రూరల్ ప్రాంతాల్లో ప్రతి మండలంలో ప్రతివారం ఆరోగ్య సురక్ష క్యాంపు ఏర్పాటుకు నిర్ణయించారు. క్యాంపుల వద్దే అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారు. క్యాంపుల్లో స్పెషలిస్టు వైద్యులు పాల్గొంటారు. 2023-24లో నవంబర్ నెలాఖరు వరకూ 12,42,118 మంది ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స తీసుకున్నారని వెల్లడించిన అధికారులు...గత ఏడాదితో పోలిస్తే 24.64 శాతం అధికంగా ఆరోగ్య శ్రీ చికిత్సలు తీసుకున్నారని వెల్లడించారు. తాజాగా రూ 25 లక్షలకు ఆరోగ్య శ్రీ పరిమితి పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో పేదలకు మేలు జరగనుంది.












Click it and Unblock the Notifications