కరోనా వ్యాక్సిన్ : నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం... ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయించుకోకపోయినా...
కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో పేరు రిజిస్టర్ చేయించుకోనివారికి కూడా వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. 60 ఏళ్లు పైబడ్డవారు ఏదైనా గుర్తింపు కార్డును చూపించి ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పొందవచ్చునని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ చూపించి వ్యాక్సిన్ పొందవచ్చునని తెలిపింది.
ఒకవేళ డాక్టర్ సర్టిఫికెట్ లేనివారు తమ మెడికల్ రిపోర్టులు,మందుల చీటీలు,ఇతరత్ర ఆధారాలు చూపించడం ద్వారా ఆయా ఆస్పత్రుల్లోని వైద్యులు అవసరమైన ధ్రువపత్రాలను అందజేస్తారని తెలిపింది. కరోనా వ్యాక్సిన్ అందించే ఆస్పత్రుల జాబితాలను cowin.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చునని పేర్కొంది.

దేశంలో ఇప్పటివరకూ 2కోట్ల పైచిలుకు మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్‌గా నిలిచింది. ఈ ఏడాది జులై నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 25కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే అన్ని క్లినిక్స్,ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ రూ.250 చెల్లించి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.
కాగా,వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. తాజాగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం వంగూరుకు చెందిన పల్లి కుటుంబరావు(65) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 10న అతను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. అప్పటినుంచి అతను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం(మార్చి 12) రాత్రి మృతి చెందాడు. కరోనా వ్యాక్సిన్ వికటించడం వల్లే తన తండ్రి చనిపోయాడని అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా 8483 మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. వీళ్లలో 46 మంది చనిపోగా మరో 51 మంది ఆస్పత్రిపాలయ్యారు.












Click it and Unblock the Notifications