ఏపీలో దుర్గా మండపాలకు ఉచిత విద్యుత్ ఇలా- ప్రభుత్వం ఆదేశాలు..!
ఏపీలో ఈ ఏడాది దసరా శరన్నవరాత్రుల సందర్బంగా ఏర్పాటు చేసే దుర్గా మండపాలకు కూడా వినాయక మండపాల తరహాలోనే ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం (AP Govt) ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు అధికారులు ఇవాళ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు విడుదల చేశారు. ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు ఈ ఉచిత విద్యుత్ అందించనున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకూ ఇది అందిస్తారన్న వివరాలు ఇందులో ఉన్నాయి.
విజయదశమి పండుగ సందర్భంగా దుర్గాదేవి మండపాలకు ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అనుమతి తీసుకున్న దుర్గా మండపాల నిర్వాహకులు నిర్ణీత నమూనాలో ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్దేశించిన పరిమితికి మించి విద్యుత్ లోడ్ అవసరమైతే మాత్రం సాధారణ తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ నిబంధనలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు దుర్గాదేవి మండపాల వద్ద విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు. దుర్గా మండపాలకు విద్యుత్ సరఫరా చేసే ముందు అధికారులు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎండీ ఆదేశించారు. పండుగ సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా మండపాలను ఏర్పాటు చేయాలని, మండపాల పైనుంచి విద్యుత్ తీగలు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ అలంకరణల కోసం నాణ్యమైన వైర్లు, స్విచ్‌లు, ప్లగ్‌లను మాత్రమే వినియోగించాలన్నారు. విద్యుత్ కనెక్షన్లు, అలంకరణల ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినా, వేలాడుతున్నా వాటిని తాకకుండా, వాటికి దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అటువంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని లేదా 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని సీఎండీ విజ్ఞప్తి చేశారు.














Click it and Unblock the Notifications
