ఏపీ మెడికల్ షాపుల్లో కొత్త యాప్.. ఇక కరోనా లక్షణాలు కనిపిస్తే....
ఏపీలో కరోనా వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. దీంతో ప్రభుత్వం ఈ దిశగా మరో ముందడుగు వేసింది. ఇకపై మందుల షాపుల్లో కరోనా లక్షణాలతో వచ్చి మందులు అడిగిన వాళ్ల వివరాలను వాటి యజమానులే అప్ లోడ్ చేసేలా ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. దీని ద్వారా కరోనా లక్షణాలున్న వారిని ముందుగానే గుర్తించి వారికి తగిన వైద్య సహాయం అందించనుంది.
కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో వాటికి గల కారణాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇందులో ముఖ్యంగా కరోనా వైరస్ ప్రాథమిక లక్షణాలైన పొడి దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారు మందులషాపులకు వెళ్లి ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారని, ఆ తర్వాత వ్యాధి ముదిరాక ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

దీంతో ఇప్పుడు వీరిని గుర్తించేందుకు వీలుగా మెడికల్ షాపుల యజమానులను ప్రభుత్వం రూపొందించిన కోవిడ్ 19 ఏపీ ఫార్మా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది. షాపుల యజమానులు తమ మొబైల్ నంబరుతో దీన్ని లాగిన్ కావాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
Recommended Video
కరోనా వైరస్ లక్షణాలతో మందుల కోసం వచ్చిన వారి వివరాలను ఎప్పటికపప్పుడు ఈ యాప్ లో అప్ లోడ్ చేయాలని మందుల షాపుల యజమానులను ప్రభుత్వం కోరుతోంది. వీటిలో దగ్గు, జ్వరం, శ్వాస వంటి లక్షణాలున్న వారి వివరాలు అందించాలని సూచించింది. వివరాలు రాగానే వెంటనే వారిని సంప్రదించి రోగులకు ఇంటివద్దే తగు సాయం అందించేందుకు ప్రయత్నిస్తామని వైద్యారోగ్య మంత్రి ఆళ్లనాని ప్రకటించారు.












Click it and Unblock the Notifications