ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - హెచ్ఆర్ఏ 8 నుంచి 16 శాతానికి పెంపు : వారికి మాత్రమే వర్తింపు..!!
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ పైన చేస్తున్న ఆందోళనతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 6వ తేదీ అర్ద్రరాత్రి నుంచి సమ్మెకు సైతం ఉద్యోగ సంఘాలు నోటీసులు ఇచ్చాయి. ఈ సమ్మెకు ఆర్టీసీ..ఆరోగ్య శాఖల ఉద్యోగులు సైతం మద్దతు ప్రకటించాయి. ముఖ్యమంత్రి వద్ద జరిగిన పీఆర్సీ చర్చల్లో భాగంగా 23 శాతం ఫిట్ మెంట్ ఖరారు పైన ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. ఇతరత్రా అలెవెన్సుల విషయంలో సీఎస్ తో సహా ఆర్దిక శాఖ అధికారులతో చర్చలు చేయాలని సీఎం సూచించారు.

హెచ్ఆర్ఏ గతం కంటే తగ్గిస్తూ..
కానీ, ఉద్యోగ సంఘాలు కోరిన విధంగా కాకుండా...అధికారులు జారీ చేసిన జీవోల్లో హెచ్ఆర్ఏ శ్లాబుల విషయంలో ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో చర్చలు రావాలని ఉద్యోగ సంఘాలను ఆహ్వానించినా.. సంఘాల నేతలు మంత్రుల కమిటీ ముందు ప్రధానంగా మూడు డిమాండ్లను ప్రస్తావిస్తోంది. వాటిని పరిష్కరిస్తేనే తాము చర్చలకు వస్తామంటూ షరతులు విధించింది. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని.. అశుతోష్ మిశ్ర కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని..ఈ నెలకు పాత వేతనాలు ఇవ్వాలనేది వారి డిమాండ్లు. అయితే, ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీ మేరకే జీతాలు చెల్లించేందుకు ట్రెజరీ ఉద్యోగులకు సర్క్యులర్లు జారీ చేసింది.

హెచ్ఆర్ఏ సవరణ..8-16 శాతానికి పెంపు
అయితే, చర్చలకు వస్తేనే దేని పైన అయినా చర్చలకు సిద్దమని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం ఆకస్మికంగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పాత పీఆర్సీ ప్రకారం 30 శాతం హెచ్ఆర్ఏ అమలయ్యేది. కొత్త పీఆర్సీ జీవోల్లో జారీ చేసిన ఆదేశాల మేరకు హెచ్ఆర్ఏ విజయవాడ - మంగళగిరి ప్రాంతాలల్లో హైదరాబాద్ నుంచి వచ్చి రీ లొకేట్ అయిన ఉద్యోగులకు ప్రస్తుతం 8 శాతం మాత్రమే హెచ్ఆర్ఏ అమలు చేసే విధంగా కొత్త పీఆర్సీ జీవోలో పేర్కొన్నారు. ఇప్పుడు వారికి 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ తాజాగా సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు నిర్ణయం అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలు... హెచ్ఓడీల్లో పని చేసే ఉద్యోగులకు మాత్రమే వర్తించేలా జీవోలో స్పష్టం చేసారు.

హెచ్ఓడీ ఉద్యోగులకే వర్తించేలా
దీంతో..విజయవాడ - గుంటూరు మధ్య ఉన్న ప్రధాన కార్యాలయాలు, అదే విధంగా గుంటూరు - విజయవాడ శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెచ్ఓడీల్లో ఉద్యోగులకు దీనిని అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా ఉద్యోగుల్లో కొంత వరకైనా శాంతిస్తారనేది అధికారుల అంచనా. అయితే, ఇప్పుడు జారీ చేసిన జీవోలోనూ కేవలం హెచ్ఓడీ కార్యాలయాల్లో పని చేసే వారికి అమలు చేస్తూ...మిగిలిన ఉద్యోగులకు పెంచకపోవటం పైన ఉద్యోగ సంఘాల్లో చర్చ సాగుతోంది. దీని పైన ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు చేస్తున్నారు. అధికారికంగా స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications