తల్లుల ఖాతాల్లో నేరుగా రూ 1,800 జమ - అర్హతలు, ఉత్తర్వులు..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం అమలుకు సిద్దమైంది. తల్లికి వందనం నిధులు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం రేపు అన్నదాత సుఖీభవ నిధుల జమ చేయనుంది. ఇదే సమయంలో విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్రతీ మూడు నెలలకోసారి రూ 1800 జమ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్ధుల అర్హత.. నిధుల జమకు మార్గదర్శకాలు ఖరారు చేసింది.
ఏపీ ప్రభుత్వం సమగ్రశిక్ష అమలు దిశగా ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల దూరంగా ఉందనే కారణంతో ఎవరూ చదువు మానేయకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు ట్రావెలింగ్ అలవెన్స్ (టీఏ) ఇచ్చే కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ అమలు చేయనుంది. గతంలో ఏడాది మొత్తానికీ కలిపి ఒకేసారి నగదు జమ చేసేవారు. తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 79,860 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించి వారికి టీఏ ఇచ్చేందుకు సిద్ధమైంది. విద్యాహక్కు చట్టం కింద బడులు దూరంగా ఉండే విద్యార్థుల కోసం కేంద్ర విద్యాశాఖ రూ.47.91 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ కార్యక్రమాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో చదివేవారికి ఈ పథకం వర్తించదని తేల్చి చెప్పారు.

ప్రభుత్వం వెల్లడించిన మార్గదర్శకాలు, విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి విద్యార్థులు టీఏ పొందడానికి అర్హులు. ప్రాథమిక పాఠశాలలు ఒక కిలోమీటరు, ప్రాథమికోన్నత పాఠశాలలు 3 కిలోమీటర్లు, సెకండరీ పాఠశాలలు 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న విద్యార్థులకు టీఏ వర్తిస్తుంది. విద్యార్థులు బస్సులు, మినీ బస్సులు, ఆటోలు, సైకిళ్లు లాంటివి వినియోగించాలని స్పష్టం చేసారు. ఆ విద్యార్థుల వివరాలను లీప్ యాప్‌లో నమోదుచేస్తారు. ఎంఈవోల పరిశీలన అనంతరం సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు వివరాలను ధృవీకరించి ఆగస్టు 10 నాటికి తుది జాబితాకు ఆమోదం ఇవ్వనున్నారు. ఆ తరువాత నెలకు రూ.600 చొప్పున ప్రతి మూడు నెలలకోసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1800 టీఏ సొమ్ము జమ అవుతుంది. 10 నెలల పాటు టీఏ నిధులు ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications