అర్ధరాత్రి వార్ మొదలు పెట్టిన దేశం.. వణికిపోయిన ఉగ్ర స్థావరాలు!
పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులతో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా ముసురుకుంటున్నాయి. ఇరాక్ వేదికగా ఇరాన్ మద్దతు ముఠాలే లక్ష్యంగా అమెరికా, సౌదీ అరేబియా దళాలు మంగళవారం అర్ధరాత్రి సమిష్టిగా విరుచుకుపడ్డాయి. అత్యాధునిక యుద్ధ విమానాలతో ఇరాక్ తూర్పు సరిహద్దుల్లోని ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ మెరుపు దాడులతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అసలేం జరిగింది?
గడిచిన 72 గంటల వ్యవధిలో ఇరాన్ తీవ్రవాద ముఠాలు విచ్చలవిడిగా ప్రవర్తించాయి. సుమారు 30కి పైగా మానవరహిత డ్రోన్లతో దాడికి తెగబడ్డాయి. అమెరికా సైనిక దళాలను, సౌదీలోని కీలక చమురు శుద్ధి కర్మాగారాలను నాశనం చేయడమే లక్ష్యంగా ఇరాన్ విప్లవ దళాలు (ఐఆర్‌జీసీ) ఈ కుట్రకు తెరలేపాయి. అయితే శత్రువుల డ్రోన్లను సౌదీ వైమానిక దళాలు సమర్థవంతంగా గాల్లోనే పేల్చివేశాయి. దీంతో తమ భద్రతకు విఘాతం కలిగిస్తున్న స్థావరాలను ధ్వంసం చేసేందుకు అమెరికా-సౌదీ కలిసి రంగంలోకి దిగాయి.

సహించేది లేదంటూ అమెరికా హెచ్చరిక
ఈ దాడుల సమాచారాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) అధికారికంగా ధృవీకరించింది. "సౌదీ చమురు సంపదను, తమ సైన్యాన్ని దెబ్బతీసేందుకు శత్రుమూకలు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టాం. ఉగ్రవాదులకు రహస్యంగా ఆయుధాలు, నిధులు సరఫరా చేస్తున్న ప్రధాన కేంద్రాలనే టార్గెట్ చేసి ధ్వంసం చేశాం" అని స్పష్టం చేసింది. 2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలోనే తమ పౌరులు, సైనిక స్థావరాలపై 600కు పైగా దాడులు జరిగాయని, ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కోలుకోలేని దెబ్బతీస్తామని ఐఆర్‌జీసీని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది.
రక్షణ కోసమే ముందస్తు దాడి: సౌదీ అరేబియా
దేశ రక్షణ కోసమే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సౌదీ అరేబియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికి వెల్లడించారు. ఇరాక్ భూభాగం నుంచి సౌదీ తూర్పు ప్రాంతంతో పాటు రాజధాని రియాద్‌లోని చమురు కేంద్రాలపైకి దూసుకొచ్చిన డ్రోన్లను గాల్లోనే నాశనం చేశామన్నారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ సెక్షన్ 51 అందించిన ఆత్మరక్షణ హక్కు ఆధారంగానే అమెరికాతో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడైనా, ఎక్కడైనా తిరుగులేని సమాధానం చెబుతామని ఆయన స్పష్టం చేశారు.
ఎర్బిల్‌లో భారీ పేలుళ్లు.. క్షిపణుల హోరు
ఇదిలా ఉండగా, ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని ఎర్బిల్ నగరం మంగళవారం తెల్లవారుజామున పేలుళ్లతో తీవ్రంగా కంపించిపోయింది. అమెరికా దౌత్య కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఉత్తర ఇరాక్‌లోని ఖలీఫాన్, సోరాన్ ప్రాంతాల్లో దాదాపు నాలుగు ఇరాన్ డ్రోన్లు వినాశనం సృష్టించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ప్రతిగా అల్-అన్బార్ ప్రావిన్స్‌లోని హదీతా డ్యామ్ వద్ద అమెరికాకు చెందిన ఓ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రచారం చేస్తోంది. సులేమానియాలోని ఖోర్ మోర్ గ్యాస్ ఫీల్డ్‌పైనా దాడులు జరగడంతో ఇరాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం అలుముకుంది.












Click it and Unblock the Notifications