ఇండస్ట్రీ ఎవడి సొత్తూ కాదు.. డ్యాన్స్ మాత్రమే వచ్చు: మోహన్‌బాబు
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకే ఒక మాట వినిపిస్తోంది.. అదే విలక్షణ నటుడు మోహన్ బాబు సంచలన కామెంట్స్. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన 'ది ప్యారడైజ్' సినిమాలో మోహన్ బాబు పోషించిన 'షికంజా మాలిక్' విలన్ పాత్ర ఏ స్థాయిలో పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం సాధించిన ఘన విజయం సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి.
ఏ ఒక్కడి సొత్తు కాదు..
"ఇండస్ట్రీ అనేది ఏ ఒక్కడి అబ్బా సొత్తు కాదు.. ప్రతిభ ఉన్నవాడిదే రాజ్యం" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. బ్యాక్‌గ్రౌండ్ ఉందనో, గాడ్‌ఫాదర్స్ ఉన్నారనో ఇండస్ట్రీలో ఎవరికీ శాశ్వత స్థానం ఉండదని తేల్చిచెప్పారు మోహన్ బాబు. ఇక ఇదే వేదికపై మాట్లాడుతూ.. కొంతమందికి కేవలం డ్యాన్సులు చేయడం, గాల్లో తేలే ఫైట్లు చేయడం మాత్రమే వచ్చునని, నవరసాలు పండించడం, హావభావాలు చూపించడం అసలు రాదంటూ పరోక్షంగా కొందరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నాని నవరసాలు పండిస్తాడు
కానీ నానిలో మాత్రం అన్ని రసాలను చక్కగా పండించగల అద్భుతమైన నటుడు ఉన్నాడని ప్రశంసల జల్లు కురిపించారు. మోహన్ బాబు ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా, మోహన్ బాబు చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
అయితే మోహన్ బాబు డ్యాన్స్, ఫైట్లు అంటూ మాట్లాడింది చిరంజీవి గురించే అని, వీరిద్దరికీ పడదు కాబట్టి కచ్చితంగా అవి అర్థమవుతున్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మోహన్ బాబు అభిమానులకు, చిరంజీవి అభిమానులకు మధ్య పెద్ద యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు తీవ్రంగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు మోహన్ బాబు చెప్పింది నిజమే అంటుండగా, మరికొందరు మాత్రం కావాలనే అన్నాడంటూ అభ్యంతరం తెలుపుతున్నారు.














Click it and Unblock the Notifications
