మోదీకి చంద్రబాబు బిగ్ రిక్వెస్ట్- ఆమోదిస్తే, కొత్త చరిత్ర..!!
కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వినతి చేసింది. అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయం కోసం లేఖ రాసింది. ఏపీ విభజన చట్టాన్ని సవరించాలని కోరింది. సాంకేతికంగా అమరావతి శాశ్వతంగా ఏపీ రాజధానిగా చట్టబద్దత కల్పించేందుకు కీలక అడుగు పడింది. త్వరలోనే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవటానికి వీలుగా ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నిర్ణయం అమరావతికి కీలక మలుపుగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.
అమరావతి కేంద్రంగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి శాశ్వత రాజధానిగా చట్ట బద్దత కల్పించాలనే డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ మేరకు కేంద్రం కసరత్తు చేసింది. ఇప్పటికే న్యాయ శాఖ పరిశీలన తరువాత కొన్ని సాంకేతిక అంశాలు తెర మీదకు వచ్చాయి. వీటిని పరిష్కరించే విధంగా ఏపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా కీలక ప్రతిపాదన కేంద్రానికి చేరింది.

దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని 2024 జూన్ 2వ తేదీ నుంచి చేరుస్తూ విభజన చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఎప్పటి నుంచి దాన్ని అమల్లోకి తేవాలో స్పష్టత ఇవ్వాలంటూ కేంద్ర హోం శాఖ ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
దీంతో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ అంశంపై స్పష్టత ఇస్తూ కేంద్ర హోం శాఖకు తాజాగా లేఖ పంపారు. అంతేకాకుండా 2024 జూన్ 2వ తేదీ నుంచి అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో చేర్చాలని కోరారు. విభజన చట్టంలో హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా పేర్కొనడం సబబుగా ఉంటుందని కేంద్ర హోం శాఖ కార్యదర్శికి తెలిపారు.
అందుకు దీని ఆధారంగా కేంద్ర హోం శాఖ కేబినెట్ నోట్ తయారుచేసి, మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు డిసెంబర్ చివరి వారానికల్లా కేబినెట్ ఇందుకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చట్టసవరణ బిల్లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల ముందుకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఏపీకి రాజధాని వ్యవహారంలో కీలక మలుపుగా మారనుంది.












Click it and Unblock the Notifications