అమరావతి పై సీఎం కొత్త ఆలోచన: ఆ మంత్రులకు బాధ్యత: ఏం చేయబోతున్నారు!
ఏపీలో రాజధాని రాజకీయాలు..నిరసనల మధ్య ప్రభుత్వ అడుగులు కీలకంగా మారుతున్నాయి. అమరావతి నుండి పరిపాలనా రాజధాని విశాఖకు మార్చాలనే ప్రతిపాదన.. అక్కడి స్థానికులు..రైతుల ఆందోళన తో ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. రాజధాని బదిలీ పైన అడుగులు ముందుకు వేస్తూనే.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నామనే భావన కలగకుండా జాగ్రత్త పడుతోంది. అందులో భాగంగా.. ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతులతో సంప్రదింపులు నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకోసం కేబినెట్ లో రాజధాని మార్పుకు అనుకూలంగా తీర్మానం చేస్తూనే..అమరావతి రైతలు ఆందోళన పరిష్కార దిశగా కొత్త ప్రతిపాదనలు తెర మీదకు తెస్తున్నట్లు సమాచారం. అందు కోస నేరుగా రైతులతో సంప్రదింపుల కోసం మంత్రులతో కమిటీకి సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కేబినెట్ లో రాజధాని అంశం ఫైనల్..
ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో రాజధాని అంశం పైన తేల్చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రతిపాదనల పైన చర్చ కారణంగా..అమరావతితో పాటుగా రాయలసీమ నుండి డిమాండ్లు మొదలవుతున్నాయి. దీంతో..రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కేవలం పరిపాలనా వికేంద్రీకరణే కాకుండా.. మొత్తం 13 జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికల పైనా చర్చ చేస్తారని సమాచారం. అందులో భాగంగా..జీఎన్ రావు కమిటీ చేసిన సిఫార్సుల పైన చర్చించి..ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే తుది నిర్ణయం ఉండే అవకాశం కనిపిస్తోంది.

అమరావతి రైతులతో సంప్రదింపులకు...
ఇక, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న ఆందోళన పైన క్షేత్ర స్థాయి సమాచారం ప్రభుత్వం సేకరిస్తోంది. ఆందోళన చేస్తున్న వారు ఎవరు..వారికి ఏమేర నష్టం జరగనుంది.. అసలు ఇప్పుడు రైతుల చేతుల్లో ఎంత మేర భూమి ఉంది..వ్యాపార లావాదేవీల్లో ఎంత మేర భూమి ఉందనే సమాచారం పూర్తి స్థాయిలో సేకరించినట్లుగా తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో మినహా.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎవరూ ఆందోళన చెందడంలేదని వాదిస్తోంది. వారిలో చాలామంది భూములను విక్రయించేసుకున్నారంటున్నాయి. ప్రభుత్వం సమీకరించిన భూముల్లో దాదాపు 15వేల ఎకరాలు క్రయవిక్రయాలతో చేతులు మారాయని ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో..వాస్తవంగా ఉన్న రైతులతో సంప్రదింపుల కోసం మంత్రులతో కమిటీ వేయాలని సీఎం ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఆ కమిటీ రైతులతో చర్చించి..వారికి గతం ప్రభుత్వం కంటే మెరుగైన ప్యాకేజీ ప్రతిపాదనలతో పాటుగా.. అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి ఇచ్చే విధంగా హామీ ఇస్తారని తెలుస్తోంది. మంత్రులు బొత్సా.. కన్నబాబు, మోపిదేవి, సుచరితతో ఈ కమిటీ ఏర్పాటు చేస్తారని సమాచారం.

రాజకీయ పార్టీల వైఖరిపైనా చర్చ...
ఇక, కేబినెట్ సమావేశంలో ప్రధానంగా జీఎన్‌రావు కమిటీ నివేదికపై చర్చ జరగనుంది. పరిపాలనా భవనాలు, హైకోర్టు బెంచ్ విశాఖలో, అసెంబ్లీ భవన సముదాయం, హైకోర్టు బెంచ్ అమరావతిలో, హైకోర్టు కర్నూలులోనూ ఏర్పాటుచేస్తూ తీర్మానం చేయనుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇదే వ్యవహారం పైన ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం రాజధాని ప్రాంత రైతులను అన్యాయం జరగదని..స్పష్టం చేస్తూనే..తమ ఆలోచలనపైన ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఇదే సమయంలో ఏకపక్షంగా నిర్ణయాలు అమలు చేస్తున్నామనే భావన రాకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటా..ఏ ప్రాంతంలోనూ వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే నిర్ణయం అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం పైన కేబినెట్ సమావేశానికి ముందే సీఎం పూర్తి వ్యూహం ఖరారు చేయనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications