చంద్రబాబు.. కాస్త పట్టించుకోరూ.. : వికలాంగుల ఫించన్ కష్టాలు
ప్రకాశం : ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే రాష్ట్ర ప్రజల అభివృద్ది, సంక్షేమం ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలు కూడా ప్రజలను దృష్టిలో ఉంచుకునే సాగాలి. అలా కాకుండా పార్టీ ప్రమేయాలకు పెద్ద పీట వేయాలని చూస్తే.. సంక్షేమ పథకాలు పడకేయడం, లబ్దిదారులు కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం ఖాయం. ఏపీలో చంద్రబాబు సర్కార్ పాలన కూడా ఇలాగే నడుస్తోంది.
చిన్నతనంలోనే పోలియో బారినపడిన రఘు అనే 24 ఏళ్ల వికలాంగుడు.. రెండేళ్ల నుంచి వికలాంగ ఫించన్ కోసం చేయని ప్రయత్నం చేయలేదు. 90 శాతం అంగవైకల్యం ఉందని వైద్యులు నిర్ధారించినా..! ప్రభుత్వం మాత్రం రఘును వికలాంగుడిగా గుర్తించడంలేదు.

దీనికి ప్రధాన కారణం జన్మభూమి కమిటీలు. ఫించన్లకు సంబంధించిన వ్యవహారం మొత్తం ఈ కమిటీల పర్యవేక్షణలోనే నడుస్తుండడంతో, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమకు నచ్చిన వాళ్లకు ఫించన్ ఇవ్వడం, నచ్చనివాళ్లను తమ చుట్టూ తిప్పించుకోవడం పరిపాటిగా మారిపోయింది.
ఈ నేపథ్యంలోనే.. రఘు బాధను చూడలేక అతని స్వగ్రామమైన ప్రకాశం జిల్లాలోని నర్సింగోలు ఊరు ఊరంతా కదిలింది. రఘును మంచంలోనే తీసుకెళ్లి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. అయితే.. అధికారులు పాటించేది జన్మభూమి కమిటీల మార్గదర్శకాలే కాబట్టి, వాళ్లు ఏమి చేయలేమని చేతులెత్తుస్తున్నారు. రఘు లాగా రాష్ట్రంలో ఇంకెంతమంది వికలాంగులు ఫించన్ కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారో..! వాళ్లందరికీ ప్రభుత్వం ఎప్పుడు న్యాయం చేస్తుందో..!












Click it and Unblock the Notifications