ఆటో డ్రైవర్ల ఖాతాల్లో నిధుల జమ తాజా ముహూర్తం - అర్హుల జాబితా..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏటా ఆటో - క్యాబ్ డ్రైవర్లకు రూ 15 వేల జమ కోసం కొత్త పథకం ప్రకటించింది. ఈ పథకానికి ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరు ఖరారు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హతల విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు లబ్ది దారుల ఎంపిక పూర్తి చేసారు. కాగా, దసరా వేళ ఈ పథకం నిధులు అర్హుల ఖాతాల్లో జమ చేయాలని భావించినా.. ఇప్పుడు అధికారికంగా డ్రైవర్ల ఖాతాల్లో నిధుల జమ ముహూర్తాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అర్హుల జాబితాలు సిద్ధమయ్యాయి.
ఏపీ ప్రభుత్వం ఆటో - క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ 15 వేలు జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ పథకం కోసం మొత్తం 3,10,385 మందిని అర్హులుగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న వీరి ఖాతాల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిధులు జమ చేస్తారు. ఈ పథకం అమలుతో రాష్ట్ర ఖజానాపై రూ.466 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15నుంచి అమలు చేశారు. దీని కారణంగా తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతోందని ఆటో, క్యాబ్ డ్రైవర్లు విన్నవించడంతో వారికి ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు అనంతపురం సభలో ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే క్షేత్ర స్థాయి పరిశీలన తరువాత అర్హుల జాబితా ఖరారు చేసారు.

ప్రభుత్వం నిర్దేశించిన అర్హతల మేరకు ఈ మేరకు అన్ని జిల్లాల్లో సచివాలయాల ద్వారా అర్హులను ఎంపిక చేశారు. బ్రాహ్మణ, కాపు, కమ్మ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రైస్తవ, ఈబీసీ, క్షత్రియ కార్పొరేషన్ల నుంచి లబ్ధిదారులకు నిధులు జమ చేస్తారు. ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్‌గా ఉండాలని, ఇతర గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులున్నా, ఆదాయపు పన్ను చెల్లించేవారున్నా, నెలవారీ విద్యుత్ వినియోగం 300యూనిట్లు దాటినా, పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నా అర్హులు కారని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్ 2న ఎంపిక చేసి వారి ఖాతాల్లో రూ 15 వేలు చొప్పున నిధులు జమ కానున్నాయి.












Click it and Unblock the Notifications