మెగా డీఎస్సీ నియామకాల పై తాజా నిర్ణయం, ఇక..!!
మెగా డీఎస్సీ 2025 పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీ పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ పైన నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణ.. కీ విడుదల పూర్తయింది. ఇక, మిగిలిన ప్రక్రియ పూర్తి చేసి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కీలక ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. మెగా డీఎస్సీకి సంబంధించి అభ్యర్థుల మెరిట్ లిస్టు రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఏపీలో మెగా డీఎస్సీ-2025కు సంబంధించిన అభ్యర్థుల కీలక జాబితా రేపు (బుధవారం) రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ.. క్రీడల కోటాకు సంబంధించిన జాబితా కూడా రావడంతో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. సర్టిఫికెట్ల ఎంపిక జాబితా అంటే దాదాపుగా ఉద్యోగాలు పొందిన వారి జాబితాగానే భావించాలి. 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా, అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవనున్నారు. వారిలో ఎవరివైనా సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే, ఆ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలుస్తారు.

ఈ మేరకు 16,347 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, బుధవారం విడుదలయ్యే సర్టిఫికెట్ల పరిశీలన జాబితాలతోనే ఎవరు ఉద్యోగాలు ఎంపికయ్యారనే విషయంపై స్పష్టత వస్తుంది. కానీ.. అధికారులు మాత్రం ఇది సర్టిఫికెట్ల పరిశీలన జాబితా మాత్రమేనని, తుది జాబితా తర్వాత విడుదల చేస్తామని చెబుతున్నారు. జిల్లాల వారీగా లిస్టులు ప్రకటించి, సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపనున్నారు. సెప్టెంబర్ నెల మొదటి వారంలో జాబితాలను సిద్ధం చేసి, రెండో వారంలో పోస్టింగ్‌లు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications