ఈ ప్రాంతాల్లోనే తుఫాను తీవ్ర ప్రభావం..అతి భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు..!!
మొంథా తుఫాన్ తరుముకొస్తోంది. ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం తీర ప్రాంతాలను అలర్ట్ చేసింది. ముందస్తు చర్యలు చేపట్టింది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదిలిన తుపాన్..ప్రస్తుతానికి మచిలీపట్నంకి 120 కిమీ, కాకినాడకి 200 కిమీ, విశాఖపట్నంకి 290 కిమీ దూరంలో కేంద్రీకృతం అయింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని..గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే వాతావరణ శాఖ ఏపీలో 17 జిల్లాలకు రెడ్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇవాళ, రేపు 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు రావొచ్చని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 233 మండలాలు, 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై తుపాను ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 2,194 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. 3,465 మంది గర్భిణీలు, బాలింతల సంరక్షణకు అధికారులు కార్యాచరణ చేపట్టినట్లు తెలిపింది. 19 జిల్లాల పరిధిలోని 54 రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసారు.

జిల్లాల్లో కమ్యూనికేషన్ కోసం 16 శాటిలైట్ ఫోన్లు, 35 డీఎంఆర్ సెట్లు ఏర్పాటు చేశారు. 11 ఎన్డీఆర్‌ఎఫ్ 12 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. ప్రధానంగా క్రిష్ణా, గోదావరి, ఉత్తరాంధ్ర, గుంటూరు జిల్లాలతో సహా 19 జిల్లాలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండు రోజులు ఈ భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. నిర్లక్ష్యంతో ఉండి ప్రాణాలు మీదకు తెచ్చుకోవద్దని మంత్రులు సూచించారు.
పురాతన ఇళ్లు, చెట్లు కింద ఉండవద్దని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు వినతి చేశారు. కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చినా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తారని చెప్పుకొచ్చారు. తుఫాను అప్డేట్స్ ఎప్పటికి అప్పుడు ప్రజలకు చేరవేసేలా సందేశాలు పంపాలని ప్రభుత్వం నిర్దేశించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపటి వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications