SRM వర్సిటీలో పుడ్ పాయిజన్ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!
గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో తాజాగా ఫుడ్ పాయిజన్ జరిగి 300 మందికి పైగా విద్యార్ధులు అస్వస్థతకు గురైన ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే ఈ ఘటనకు దారి తీసిన కారణాలపై ఆరా తీసిన ప్రభుత్వం వైద్యాధికారుల్ని పంపింది. అదే సమయంలో వర్సిటీ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తున్న వేళ చర్యలకు కూడా ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ లో ఫూడ్ పాయిజన్ ఘటనపై విచారణకు కమిటీని నియమిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ .తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో తెనాలి సబ్ కలెక్టర్, ఉన్నత విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఆహార తనిఖీ అధికారి, మంగళగిరి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి సభ్యులుగా ఉంటారు. ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ లో ఫూడ్ పాయిజన్ ఘటనపై క్షుణ్ణంగా విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ మేరకు కమిటీ రంగంలోకి దిగింది.

మరోవైపు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ పై గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా కూడా స్పందించారు.
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో దాదాపుగా 300 మంది అస్వస్థత గురైనట్టుగా గుర్తించామన్నారు. వారిలో కొంతమందికి డయేరియా లక్షణాలు, కొంతమందికి వాంతులు విరోచనాలతో అస్వస్థత గురయ్యారని తెలిపారు. దానికి సిఆర్డిఏ గ్రామాలనుంచి సరఫరా అవుతున్న నీటి వలన ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం ఆర్వో వాటర్ నే సరఫరా చేస్తున్నట్టు చెప్పిందని సబ్ కలెక్టర్ తెలిపారు. దాదాపుగా యూనివర్సిటీలో 6,000 మంది విద్యార్థులు మరియు సిబ్బంది ఉన్నారని, వారిలో కేవలం 300 మందే అస్వస్థత గురవటం దానిపై పూర్తి దర్యాప్తు జరిపి కొన్ని గంటలలో నివేదికనే అందిస్తామన్నారు. నివేదిక ఆధారంగా యూనివర్సిటీకి మెమో జారీ చేయటం దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయని, నివేదిక ఆధారంగా యూనివర్సిటీకి ఎస్పీవో పంపిస్తామన్నారు.












Click it and Unblock the Notifications