విద్యారంగంలో సీఎం జగన్ కీలక నిర్ణయం - పరీక్షల్లో కొత్తగా..!!
ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక నిర్ణయానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. టోఫెల్ శిక్షణను కేవలం జూనియర్ స్థాయికే పరిమితం చేయకుండా ప్లస్ వన్, ప్లస్ టూ (ఇంటర్) వరకూ విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈటీఎస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
టోఫెల్ శిక్షణ విస్తరణ : ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదిగేలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. టోఫెల్ శిక్షణను విస్తరించాలని సీఎం జగన నిర్ణయించారు. 11, 12వ తరగతులు పూర్తి చేసిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటారని... అందుకే జూనియర్ లెవెల్‌తో ఆపేయకుండా సీనియర్ లెవెల్ వరకూ విస్తరించాలని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం అట్టడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను చేపడుతోందని తెలిపారు. రాష్ట్రంలో 6వ తరగతి, ఆపై తరగతులకు సంబంధించి మొత్తం 63 వేల తరగతి గదులకు గాను 30,230 క్లాస్ రూమ్‌లు అంటే 50 శాతం జూలై చివరి నాటికి డిజిటలైజ్ చేస్తున్నామని చెప్పారు. మిగిలిన వాటిని డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని వెల్లడించారు.
ప్రతి విద్యార్థి కి ట్యాబ్‌లు : 8వ తరగతిలోకి అడుగు పెడుతున్న ప్రతి విద్యార్థి కి ట్యాబ్‌లు పంపిణీ చేశామని చెప్పిన సీఎం... ఈ ఏడాది డిసెంబరు 21న మళ్లీ ట్యాబ్‌ల పంపిణీ చేపడతామని ప్రకటించారు. బైజూస్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం విద్యార్థులకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
1 నుంచి 9వ తరగతి వరకు ద్విభాషా (బైలింగ్యువల్) పాఠ్యపుస్తకాలను సరఫరా చేశామని వివరించారు. వచ్చే ఏడాది 10వ తరగతికి కూడా ద్విభాషా పుస్తకాలను అందిస్తామన్నారు. టెన్త్ విద్యార్థులు 2025లో సీబీఎస్‌ఈ పరీక్షలకు ఇంగ్లిష్ మీడియంలో హాజరవుతారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దాదాపు 45 వేల ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాడు - నేడు ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు.

రోల్ మోడల్ గా నిలిచేలా : తొలిదశలో ఇప్పటికే 15,750కిపైగా స్కూళ్లను అభివృద్ధి చేయగా డిసెంబరు నాటికి మరో 16 వేలకు పైగా స్కూళ్లలో రెండో దశ పనులు కూడా పూర్తవుతాయన్నారు. వచ్చే ఏడాది మిగిలిన స్కూళ్లలో పనులు చేపడతామని... విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ క్రమంలో ప్రతి విద్యార్థికి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని ఉచితంగా అందిస్తున్నాం.
వీటికి అదనంగా ఇప్పుడు టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్, టోఫెల్ సీనియర్ పరీక్షలను కూడా ప్రవేశపెడుతున్నామన్నానరు. ఇది మంచి మార్పులకు దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇదంతా మానవ వనరులపై పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నామని... కచ్చితంగా ఈ కార్యక్రమం ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications