పండగ వేళ- ఏపీలో పేదలకు శుభవార్త
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పేదలకు శుభవార్త చెప్పింది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజుల భారాన్ని భారీగా తగ్గించింది. నామమాత్రం రేటును నిర్ధారించింది. దసరా కానుకగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి.
రాష్ట్రంలోని అన్ని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 50 చదరపు గజాలలోపు విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన జీ ప్లస్ 1 లేదా అంత కంటే తక్కువ ఇళ్లకు నిర్మాణదారులు ఒక్క రూపాయిని ఫీజు రూపంగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు ఇంటి నిర్మాణానికి సంబంధించి బ్లూప్రింట్ ను ఆన్ లైన్ లో అప్లోడ్ చేసిన అనంతరం ఒక రూపాయి ఫీజును చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ఏటా ఆరు కోట్ల ఫీజుల భారం తప్పుతుంది.

రాష్ట్రంలో మొత్తం 123 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ విధానం అమలులోకి వచ్చింది. ఇళ్ల నిర్మాణానికి మాత్రమే ఈ రూపాయి ఫీజు వర్తిస్తుంది. వాణిజ్య అవసరాల కోసం చేపట్టే నిర్మాణాలకు ఇది వర్తించదు. అంటే.. యజమానులు ఆ 50 చదరపు గజాల స్థలంలో దుకాణాలు గానీ, షట్టర్లు వేసిన గదులు గానీ నిర్మించదలచుకుంటే ఈ రూపాయి ఫీజు వర్తించదు. అలాంటి నిర్మాణాలకు ప్రస్తుతం అమలులో ఉన్న ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే- 60 చదరపు గజాల విస్తీర్ణం గల స్థలంలో 50 గజాల్లో ఇంటిని నిర్మించదలచుకున్నప్పటికీ- ఈ రూపాయి ఫీజు వర్తించబోదు. లిటిగేషన్ ఉన్న స్థలాలను కూడా ఈ సౌకర్యం నుంచి తొలగించింది ఏపీ ప్రభుత్వం. ఒకవేళ- యజమానులు 50 చదరపు గజాల లిటిగేషన్ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టినా కూడా ఆ తర్వాత అయినా దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అంతేకాకుండా ఆ స్థల యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.












Click it and Unblock the Notifications