అమరావతి నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అమరావతి భవిష్యత్ ప్రణాళికల పైన కసరత్తు కొనసాగుతోంది. ఆర్దికంగా నిధుల సమీకరణతో పాటుగా నిర్మాణాల విషయం లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పైన నివేదికలు కోరుతున్నారు. అందులో భాగంగా అమరావతిలో నిర్మాణాల పటిష్ఠత పైన ప్రభుత్వం పోకస్ చేసింది. ఐకానిక్ భవనాల నిర్మాణాల పైన తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భవనాలపై అధ్యయనం
అమరావతిలో తిరిగి పనుల ప్రారంభం ముందు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్మించిన నిర్మాణాల్లో అయిదేళ్ల కాలంలో పురోగతి లేదు. తిరిగి వాటిని పూర్తి చేయటంతో పాటుగా భవిష్యత్ నిర్మాణాల పైన ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. అమరావతిలో మధ్యలో నిర్మాణాలు నిలిచిపోయిన కట్టడాల పటిష్టతపై ముందుగా ఒక అంచనాకు రావాలని నిర్ణయించింది. దీనికోసం ఐఐటి నిపుణుల చేత కట్టడాల పటిష్ఠతపై అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్లు ఏపీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

నివేదిక ఆధారంగా
గతంలో ఫౌండేషన్ పూర్తి చేసుకున్న ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలపై- ఐఐటి ఇంజినీర్ల చేత అధ్యయనం చేయించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. ఐకానిక్ కట్టడాల ఫౌండేషన్ పటిష్టత నిర్దారణ కోసం ఐఐటి చెన్నైకి బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయింది.. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల క్వార్టర్ల పటిష్టత నిర్దారణ కోసం ఐఐటీ హైదరాబాద్‌కు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.

ప్రణాళికలపై కసరత్తు
ఐఐటీ నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా నిర్మాణాల విషయంలో ముందుకెళ్తామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు. అమరావతిలో నిర్మాణాల కోసం గతంలో 47 మంది కన్సల్టెంట్స్‌ను నాటి ప్రభుత్వం నియమించింది. వైసీపీ హయాంలో వారంతా తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ కన్సల్టెంట్ల నియామకం కోసం టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ చెప్పారు. సీఆర్డీయేలో గతంలో ఉన్న సిబ్బంది కంటే ప్రస్తుతం 528 మంది తక్కువగా ఉన్నారని, సిబ్బంది కొరత తీర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications