ఏపీకి భారీ వర్ష సూచన వేళ- వలంటీర్లకు కీలక ఆదేశాలు జారీ
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా- ప్రత్యేకించి కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని అంచనా వేసింది. ఈ ఆవర్తనం క్రమంగా అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది.
విపత్తుల నిర్వహణ విభాగం కూడా భారీ వర్షాలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. మన్యం పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కడప, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిస్తాయని తెలిపింది.

భారీ వర్షాలు ముంచుకొస్తోన్న ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాలతో పాటు సీజనల్ వ్యాధులు ముంచుకొచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలను తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టబోతోంది.
సోమవారం ఫీవర్ సర్వే ప్రారంభం కానుంది. వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటారు. ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వేను చేపడతారు. సీజనల్ వ్యాధులపై ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సమీక్ష చేపట్టారు. డెంగ్యూ, మలేరియా కిట్ల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
గతంలో డెంగ్యూ, మలేరియా కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించాలని మంత్రి ఆదేశించారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్/నవంబర్ వరకు సీజనల్ వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుందని, వాటిని నివారించడానికి గ్రామస్థాయిలో సమన్వయంతో పని చేయాలని అన్నారు. మందుల కొరత ఉండకూడదని, ముందుగానే స్టాక్స్ పెట్టుకోవాలని అన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత అప్రమత్తత అవసరమని మంత్రి రజిని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని, గిరిజనులు, ఆదివాసీలు జ్వరం బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు.












Click it and Unblock the Notifications