రిజిస్ట్రేషన్ల విధానంలో కీలక మార్పులు - ఇక నుంచి..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ లకు కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిరీక్షించే అవసరం లేకుండా ముందుస్తుగా స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనున్నారు. ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. పని వేళల్లో ముందస్తుగానే స్లాట్ బుకింగ్ ద్వారా తమ సమయాన్ని ఖరారు చేసుకోవచ్చు. దీని ద్వారా ఇక నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వేచి ఉండకుండా.. వెళ్లిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు.
స్లాట్ విధానంలో
ఏపీ ప్రభుత్వం కొత్తగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ లకు స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులోకి తీసు కుచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సదుపాయం అమల్లోకి రానుంది. రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 మధ్య రిజిస్ట్రేషన్ కోసం సమయం ఖరారు చేసుకునేందుకు డైనమిక్ క్యూ మేనేజ్ మెంట్ సిస్టిం అందుబాటులోకి వచ్చింది. ఐజీఆర్ఎస్ వెబ్ సైట్ లోకి లాగిన్ అయిన వెంటనే డాక్యుమెంట్ ప్రిపరేషన్ మాడ్యూల్ ఉంటుంది. అందులో ఆస్తుల వివరాలు నింపిన అనంతరం దరఖాస్తు ఐడీ వస్తుంది. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్ సమయాన్ని ఖరారు చేసుకోవచ్చు. కంకిపాడు రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నారు.

నిరీక్షణకు తెర
ఈ విధానం ద్వారా ఇక నుంచి భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇబ్బందులను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసమే రవాణాశాఖలో మాదిరి స్లాట్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా క్రయవిక్రయదారులకు ఇబ్బం దులు తప్పనున్నాయి. రిజిస్ట్రేషన్ల కోసం ఉదయం కార్యాలయాలకు వచ్చే వారితో సాయంత్రం వరకు రద్దీ కనిపిస్తోంది. ప్రస్తుతం వివాహ రిజిస్ట్రేషన్లు, భూముల క్రయవిక్రయాల రిజిస్ర్టేషన్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయానికే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకున్నా.. ఒక్కోసారి సర్వర్ సమస్య, లేదంటే రద్దీ కారణంగా సాయంత్రానికి కూడా ప్రక్రియ పూర్తయ్యేది కాదు. రాత్రి సమయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు జరిగేవి.
ఇలా చేయాలి
రిజిస్ట్రేషన్ల కోసం రోజంతా నిరీక్షించే అవసరం లేకుండా ఈ స్లాట్ విధానం ఉపయోగ పడనుందని అధికారులు చెబుతున్నారు. స్లాట్ విధానంతో ఏ సమయానికి రిజిస్ట్రేషన్ చేస్తారో క్రయ విక్రయ దారుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ వెళ్తుంది. ఆ సమయానికి దస్త్రాలు సిద్ధం చేసుకొని వెళితే గంటలోపే రిజిస్ట్రేషన్ పక్రియ ముగుస్తుంది. వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇదే విధానం అమలు కానుంది. స్లాట్ బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ స్లాట్ రద్దు చేసుకుంటే మాత్రం రూ.100 చెల్లించాలి. రద్దు చేసుకున్న స్లాట్‌ను మళ్లీ బుక్ చేసుకుంటే రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ చెల్లింపుల పైన స్పష్టత రావాల్సి ఉంది. సెలవు రోజుల్లో కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ముందు రోజునే అన్ని వివరాల తో సంబంధిత కార్యాలయానికి ఆన్ లైన్ లో అన్ని వివరాలు పొందుపర్చి.. స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications