సాధారణ బదిలీలకు రంగం సిద్దం - విధి విధానాలు..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది. పాలనా పరంగా ప్రక్షాళన మొదలైంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. కీలక పోస్టుల్లో అధికారుల నియమాక ప్రక్రియ పూర్తయింది.ఇక..సాధారణ బదిలీల పైన ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. 13 ఉమ్మడి జిల్లాల పరిదిలో బదిలీల పై సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ భేటీలో విధి విధానాలను ఖరారు చేయనున్నారు.
పాలనలో ప్రక్షాళన
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత పాలనలో కీలకమార్పులు చేస్తున్నారు. గత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు నిబంధనలకు విరుద్దంగా పని చేసిన అధికారులను పక్కన పెట్టారు. కీలక పదవుల్లో అధికారుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. అసెంబ్లీ కొలువు తీరింది. కొత్త ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశం ఈ నెల 24న జరగనుంది. అధికార స్థాయిలో ప్రక్షాళనలో కొంత భాగం పూర్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు..ఇక జిల్లా స్థాయిలోనూ కసరత్తు ప్రారంభించారు. ఇందు కోసం సాధారణ బదిలీలకు రంగం సిద్దం అవుతోంది.

సాధారణ బదిలీల పై
ఇప్పటికే ఉన్నతాధికారుల బదిలీలు చేసిన ప్రభుత్వం...తాజాగా సాధారణ బదిలీల పైన ప్రస్తావన చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా జూన్ - జూలై నెలల్లో ప్రభుత్వం సాధారణ బదిలీలను చేపడుతుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావటం..కొత్త ప్రభుత్వం కొలువు తీరటంతో కొంత ఆలస్యం అయింది. దీంతో..ఇప్పుడు సాధారణ బదిలీల ద్వారా జిల్లా స్థాయి నంచి మండల స్థాయి వరకు పాలనా వ్యవస్థలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, బదిలీలు పాత 13 జిల్లాల ప్రాతిపదికన ఉండేలా విధాన పరమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.
మంత్రివర్గంలో తుది నిర్ణయం
ఈ నెల 24న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ సాధారణ బదిలీల పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కొన్ని పోస్టుల్లో ఏళ్ల తరబడి కొందరు అధికారులు కొనసాగుతున్న తీరు కొత్త ప్రభుత్వం గుర్తించింది. అదే విధంగా ప్రజలతో నిత్యం సంబంధం ఉండే శాఖల్లోనూ మార్పులు అవసరమని భావిస్తోంది. అయితే, విద్యా సంవత్సరం ప్రారంభం కావటంతో సాధారణ బదిలీల పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాతనే తుది మార్గదర్శకాలు జారీ చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో, ప్రభుత్వం ఈ విషయంలో తీసుకొనే తుది నిర్ణయం పైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications