అమరావతిలో ఆర్దిక అవసరాల కోసం భూమి కేటాయింపు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ రాజధాని పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఇప్పటికే అమరావతిలో పర్యటించిన చంద్రబాబు..తాజగా రాజధాని పైన శ్వేతపత్రం విడుదల చేసారు. అందులో ఇప్పటి వరకు రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు..ఖర్చు గురించి వివరించారు. ఎన్ని కష్టాలు వచ్చినా అమరావతి పై ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఇదే సమయంలో ఆర్దిక అవసరాల కోసం అమరావతిలో కేటాయించిన భూముల వివరాలను శ్వేతపత్రంలో వివరించారు.
ఆర్దిక అవసరాల కోసం
అమరావతి పరిధిలో సమీకరించిన భూమిలో 8,274 ఎకరాలను ఆర్థిక అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వం శ్వేతపత్రంలో పేర్కొంది. పూలింగు సమయంలో ఇక్కడ భూమి నుండి వచ్చే ఆదాయం ద్వారా రాజధాని నిర్మించుకోవచ్చని 2019కు ముందు చంద్రబాబు వెల్లడించారు. కనీసం 8 వేల ఎకరాలు మిగులు ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన శ్వేతపత్రంలో అసలు విషయాన్ని స్పష్టం చేశారు. 53,748 ఎకరాల్లో రోడ్లు ఇతర సదుపాయాల కోసం 27,885 ఎకరాలు, రైతులకు ప్లాట్లు తిరిగి ఇచ్చేందుకు 11,826 ఎకరాలు, ఇతర అవసరాల కోసం 14,037 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. అయితే ఇతర అవసరాలు ఏమిటనేది శ్వేతపత్రంలో ప్రస్తావించలేదు.

భవిష్యత్ ప్రణాళికలు
మిగిలిన 8,274 ఎకరాలను మానిటైజేషన్ (నిధుల రూపంలోకి మార్చుకోవడం) కోసం అందుబాటులో ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. ప్రస్తుతం అమరావతి ర్యాంకింగ్ దెబ్బతినడంతో వీటిని ఎలా ఉపయోగిస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది. శ్వేతపత్రం విడుదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ర్యాంకింగ్ లేకపోతే పెట్టుబడి సంస్థలు రావని, బ్యాంకర్లూ రుణాలు ఇవ్వరని తెలిపారు. ఇప్పుడో పెద్ద సమస్యగా ఉంటుందనీ తెలిపారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ముందుకొచ్చిన సింగపూర్ కన్సార్టియంను రద్దు చేశారని, ఇప్పుడు సింగపూర్ సంస్థలు కూడా ముందుకు వస్తాయా లేదా అనే అంశంపై ఆలోచనలో పడ్డట్లు పేర్కొన్నారు.
పెండింగ్ లో ప్లాట్ల రిజిస్ట్రేషన్
ఇక, రాజధాని పరిధిలో పూలింగుకు తీసుకున్న భూముల నుండి రైతులకు ఇచ్చిన ప్లాట్లలో 25,186 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ విషయాన్ని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. రాజధాని పరిధిలో 217 చదరపు కిలోమీరట్ల విస్తీర్ణంలో ఉన్న 53,748 ఎకరాల్లో రైతుల నుండి 34,281.12 ఎకరాలు సమీకరించారు. వీటిల్లో 33,836 పాస్‌బుక్ ఖాతాదారులు ఉన్నారు. ఇంకా 4,300 ఎకరాలు సేకరించాల్సి ఉంది. వీటికి సంబంధించి రైతులకు నివాస ప్రాంత ప్లాట్లు 37,479, వాణిజ్య ప్లాట్లు 25,931 మొత్తం 63,410 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. వీటిల్లో 22,592 నివాస ప్రాంత ప్లాట్లను, 15,632 వాణిజ్య ప్లాట్లను రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తంగా 38,224 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఇంకా 25,186 ప్లాట్లను రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications