రఘురామ రిపోర్ట్ ఆలస్యంపై హైకోర్టు సీరియస్- సర్కారుకు ధిక్కార నోటీసులు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మెడికల్ రిపోర్ట్ వ్యవహారంపై హైకోర్టు ఇవాళ తీవ్రంగా స్పందించింది. మెడికల్ రిపోర్ట్‌ను తామిచ్చిన గడువులోగా ఇవ్వకుండా ఆలస్యం చేయడంపై కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైనందుకు సీఐడీతో పాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌పైనా కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు రఘురామ మెడికల్ టెస్టులకు ఆదేశించక ముందే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

రఘురామ కేసుపై హైకోర్టు విచారణ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా వాటిని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడం పట్ల ఉన్నత న్యాయస్ధానం ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుల ఆదేశాలు అమలు కాకపోవడం పట్ల హైకోర్టు సీరియస్ అయింది.

ఏపీ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
రఘురామకృష్ణంరాజుకు మెడికల్ టెస్టులు నిర్వహించే విషయంలో హైకోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. మధ్యాహ్నం 12 గంటలకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినా సాయంత్రం 6 గంటల వరకూ ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది.

ఏపీ సర్కార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు
మెజిస్ట్రేట్ కోర్టుతో పాటు తాము కూడా ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ అదనపు డీజీతో పాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని జుడిషియల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications