బీజేపీ టీడీపీలకు షాక్: తిరుపతి ఉపఎన్నిక రద్దు పిటిషన్ కొట్టేసిన హైకోర్టు..కీలక వ్యాఖ్యలు..!
అమరావతి: తిరుపతి ఉపఎన్నిక చాలా హాట్ హాట్‌గా ముగిసింది. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి అభ్యర్థుల ఎంపిక ఆ తర్వాత ప్రచారం వరకు అంతా వాడీవేడీగా సాగింది. ఇక తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ రోజున అసలు కథ బయటపడింది. తిరుపతిలోకి నకిలీ ఓటర్లు ప్రవేశించారని పేర్కొంటూ ఇటు టీడీపీ అటు బీజేపీ కార్యకర్తలు హంగామా చేశారు. అంతేకాదు తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించాయి బీజేపీ టీడీపీ.
తిరుపతి ఉపఎన్నిక రద్దు కోరుతూ హైకోర్టులో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, టీడీపీ పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అంతేకాదు రెండు పిటిషన్లను డిస్పోజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు పిటిషన్లను కొట్టివేసింది. తిరుపతి ఉపఎన్నిక ఏప్రిల్ 17వ తేదీన జరిగింది. అయితే ఉదయం నుంచే తిరుపతిలో హడావుడి వాతావరణం కనిపించింది. తిరుపతిలో ఓటువేసేందుకు నకిలీ ఓటర్లు దిగారంటూ టీడీపీ హంగామా చేసింది. ఓ బస్సును నిలిపివేసి అందులో ప్రయాణిస్తున్నవారిని టీడీపీ నేతలు పట్టుకున్నారు. వారిని ప్రశ్నించారు. అయితే వారు తిరుమల దర్శనానికి వెళుతున్నామని సమాధానం ఇచ్చారు. అయితే దీనిపై సంతృప్తి చెందని టీడీపీ నేతలు ఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
ఇక బీజేపీ నేతలు కూడా పలు ప్రాంతాల్లో పర్యటించి ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తులను పట్టుకున్నారు. తిరుపతి పోలింగ్‌లో దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ నేతలు బయట నుంచి వేల మందిని తరలించారని టీడీపీ నేతలు ఆరోపించారు. నెల్లూరు, తిరుపతి పరిధిలోని పలు సెగ్మెంట్లలో దొంగ ఓట్లు వేసేందుకు పలువురు ప్రయత్నించారని వారు ఆరోపించారు. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఫేక్ ఓటరు కార్డులతో ఓటేసేందుకు కడప నుంచి పలువురు వచ్చారన్న వార్తలతో పాటు వచ్చిన ఓటర్లకు స్లిప్‌లను వాలంటీర్లు పంపిణీ చేయడాన్నీ టీడీపీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది అటు బీజేపీ నేతలు కూడా పలుచోట్ల ఫేక్ ఓటర్లను అడ్డుకున్నారు.

దీంతో ఆయా చోట్ల ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్నాయి. పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ ఓ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుపతి లోకసభ ఎన్నికల్లో వైసీపీ నాయకులు దొంగ ఓట్లను యథేచ్ఛగా వేస్తున్నారని రత్నప్రభ ఆరోపించారు. దీనిపై పోలీసులతో పాటు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇక చేసేదేమీ లేక రత్నప్రభ ఉపఎన్నిక రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
హైకోర్టులో రత్నప్రభ దాఖలు చేసిన పిటిషన్‌లో తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పలు ఘటనలను ప్రస్తావించారు. ఇందులో తిరుపతి పోలింగ్ సందర్భంగా ఓటేసేందుకు భారీ ఎత్తున నకిలీ ఓటర్లు వచ్చారని, వారంతా తమ పేరు, తల్లితండ్రుల పేర్లు కూడా చెప్పలేకపోయారని ఆరోపించారు.
ఏపీ ప్రభుత్వం, పోలీసులు చెక్‌పోస్టులు, బారికేడ్లను తొలగించి మరీ తిరుపతిలో నకిలీ ఓటర్లను బస్సుల్లో వచ్చేందుకు సహకరించారని పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కానీ, ప్రధాన ఎన్నికల అధికారి కానీ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. అందుకే హైకోర్టును ఆశ్రయించినట్లు రత్నప్రభ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణ చేసిన ధర్మాసనం ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని చెబుతూ దాఖలైన రెండు పిటిషన్లు కొట్టేసింది.












Click it and Unblock the Notifications