ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు- ఆ బిల్డింగ్స్ విద్యాశాఖకు అప్పగింత-కూల్చివేస్తే 40 కోట్ల వృథా !
ఏపీ స్కూళ్లలో ప్రభుత్వం గతంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాల వ్యవహారం ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. హైకోర్టు ఆదేశాల్ని లెక్కచేయకుండా ఈ భవనాల్ని నిర్మించిన వ్యవహారంలో న్యాయస్ధానం ఆగ్రహంతో ఇవాళ సీఎస్, ఇతర ఐఏఎస్ లు న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. దీంతో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించిన ఆర్బీకేలు, పంచాయతీ భవనాలను విద్యాశాఖకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టుకు హాజరైన సీఎస్, పంచాయతీరాజ్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను ఉద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలకు విరుద్దంగా భవనాల నిర్మాణంపై హైకోర్టు సీరియస్ అయింది.
కట్టిన భవనాలను వెంటనే విద్యాశాఖకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. దాదాపు 40కోట్లరూపాయలతో భవన నిర్మాణాలు చేపట్టామని అధికారులు కోర్టుకు తెలిపారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

భవనాలుకూల్చివేయాల్సి వస్తే భవనాలకు అయిన ఖర్చు ప్రతి రూపాయి ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి ఫీల్డ్ స్థాయి అధికారి వరకు వసూలు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. దీంతో పాఠశాలలో నిర్మించిన భవనాలు పాఠశాలలకు వినియోగిస్తామని అధికారులు తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో భవన నిర్మాణాలు చేపట్టడం వల్ల పాఠశాల వాతావరణం దెబ్బతింటుదన్న పిటిషనర్ తరుపు లాయర్ లక్ష్మీ నారాయణ వాదనతో న్యాయస్ధానం ఏకీభవించింది.
పాఠశాల హెచ్ యం,విద్యాశాఖ అధికారులతో కమిటీ వేసి నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది.హెచ్ యం లతో,విద్యాశాఖ అధికారులతో పాటు తల్లిదండ్రులను కమిటీలో ఉంచి అభిప్రాయం తీసుకోవాలన్న పిటిషనర్ తరుపు లాయర్ వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ.. తదుపరి విచారణ వచ్చే నెల 20కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications