టీడీపీ మాజీ మంత్రి నారాయణ కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
అదే సమయంలో ప్రభుత్వం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్‌లో కుంభకోణాన్ని సైతం తెర మీదికి తీసుకొచ్చింది. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఈ విషయంలో ఆయనకు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులను సైతం జారీ చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ నారా లోకేష్‌కు నోటీసులను అందజేశారు.

ఇదే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకూ నోటీసులు అందాయి. సీఐడీ అధికారులు ఆయనకూ నోటీసులను ఇచ్చారు. మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పులు, మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదించారని భావిస్తున్నారు.
అక్టోబర్ 4వ తేదీన నారా లోకేష్‌తో పాటు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. బుధవారం విచారణకు హాజరు కావాల్సిన ఉన్న నేపథ్యంలో- నారాయణ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. 65 సంవత్సరాల వయస్సున్న తనను ప్రత్యక్ష విచారణకు హాజరు కావాలని ఆదేశించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమంటూ పిటిషన్ వేశారు. తనను ఇంటి వద్దే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. దీన్ని విచారణకు స్వీకరించింది ఏపీ హైకోర్టు. ఈ ఉదయం విచారణ చేపట్టింది. వాదోపవాదాలను ఆలకించిన తరువాత ఈ పిటీషన్‌పై విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications